online marketing

Friday, January 8, 2010

స్పోర్ట్‌ సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నారు-చర్యలు తీసుకోండి


నెల్లూరు (స్పోర్ట్‌‌స) మేజర్‌న్యూస్‌: పలు క్రీడా సంఘాలు జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయివరకు క్రీడా పత్రాలను అమ్ముకుంటున్నారని రైట్‌ టు ప్లే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వై.సుమన్‌ గురువారం నగరంలోని ఎసి.సుబ్బారెడ్డి స్పోర్ట్‌‌స కాంప్లెక్స్‌లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారికి ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా విలువలను దిగజారుస్తూ జిల్లా ఖో-ఖో సంఘం కార్యదర్శి జిలానీబాషా విజయనగరం బాలుర ఖో-ఖో అకాడెమి టాప్‌ ర్యాంకర్‌ క్రీడాకారుడిని కె.శ్రీకాంత్‌ అనే పేరుతో 20వ సబ్‌జూనియర్‌ నేషనల్‌ ఖో-ఖో చాంపియన్‌షిప్‌- 2005-06 ఆడిపించి ఆ సర్టిఫికేట్‌ను శ్రీకాంత్‌ అనే విద్యార్థికి రూ.70 వేలకు అమ్ముకున్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖో-ఖో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పార్టిసిపేషన్‌ సర్టిఫికేట్‌ 533ని శాఫ్‌ అధికారుల పరిశీలన నిమిత్తం అందజేశారు. జిల్లాలో క్రీడాసంఘాల్లో స్పోర్ట్‌‌స అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు క్రీడాసంఘాల్లో కీలకపాత్ర వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఇతర జిల్లాల క్రీడాకారులను జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించేటట్లు చేయడం ద్వారా డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసోసియేషన్‌ సభ్యుల అండదండలతో అక్రమంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల వివరాలను ఆయన తెలిపారు. జాతీయ జూనియర్‌ సౌత్‌జోన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో నేరుగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అలానే అసోసియేషన్‌ నిర్వహణా కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పిల్లలు, బంధువుల పిల్లలు ఎంపికల్లో పాల్గొనకుండానే నేరుగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆడినట్లు సర్టిఫికేట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విధమైన అనేక అక్రమాలకు సంబంధించిన విషయాలపై విచారణ జరపాలని ఆయన డిఎస్‌డిఒను కోరారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటా : డిఎస్‌డిఒ సర్టిఫికేట్ల అమ్మకాలు గురించి సంబంధిత అసోసియేషన్‌తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోడానికి అధికారులతో సంప్రదిస్తామని డిఎస్‌డిఒ జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

జీతాలు పొందడమే కాదు... వైద్యసేవలందించాలి


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో అధికారులు, సిబ్బంది నెలకు రూ.80 లక్షల మేర జీతాలు పొందుతున్నారని, అయితే కొంతమంది వైద్య, మినిస్టీరియల్‌ సిబ్బంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో రోగులకు వైద్యసేవలు అందించడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆయన వివిధ వైద్యసేవల విభాగాలను సంద ర్శించి సంబంధిత రిజిష్టర్లను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందజేశారు.రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో వైద్యసిబ్బందితో పాటు మినిస్టీరియల్‌ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. కొంతమంది ఇక్కడే ఉద్యోగంలో చేరి, ఇక్కడే పదోన్నతులు పొంది దాదాపు 15 ఏళ్లకు పైగా ఒకే స్థానంలో ఉండడంతో వారు విధులలో శ్రద్ధ వహించకుండా ఉదాసీనత చూపడం విచారకరమన్నారు. అలాంటి సిబ్బందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రోగులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం వెచ్చించి నిలబడి అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివి జరగకుండా నిర్దేశిత సమయాన్ని కేటాయించి అందుకు అనుగుణంగా సిబ్బందికి విధులు కేటాయించాలని ఆదే శించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఒకే వ్యక్తికి పనిభారం లేకుండా, ఉన్న సిబ్బందికి తగిన విధులను కేటాయించి సరళతరంగా చేయాలన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్టులు, నర్సింగ్‌ సిబ్బంది, ఇతరులు విధులపై ప్రతిరోజూ పర్యవేక్షించి సక్రమంగా నిర్వర్తించేలా చూడాలన్నారు. సంబంధిత రిజిష్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఆసుపత్రిలో పాడైపోయిన ఫర్నిచర్‌, తదితర పరికరాలను వెంటనే వేలం వేసి సంబంధిత నివేదికలను అందజేయాలన్నారు. ప్రధానంగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు సకాలంలో అవసరమైన మందులు పంపిణీ చేయడంలో శ్రద్ధ వ హించాలన్నారు. ప్రతి రోజూ హెచ్‌ఐవిపై పరీక్షలు చేయించుకున్నవారి పేర్లను, ఫోన్‌ నెంబర్లను కంప్యూటర్‌లో నమోదు చేయాలన్నారు. ఒకవేళ హెచ్‌ఐవి సోకినవారికి అవసరమైన మందులు క్రమం తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఆయన ముందుగా హెచ్‌ఐవి ఎయిడ్స్‌ చికిత్సా కేంద్రాన్ని సందర్శించి ఎయిడ్స్‌ రోగులకు అందిస్తున్న మందుల పంపిణీ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ టివిఎస్‌.రాజా, జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చెన్నయ్య, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.పెంచలయ్య, ఆర్‌ఎంఒ డాక్టర్‌ జూలియానా, రక్తనిధి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ బి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నగరంలో భారీగా వాహనాల ర్యాలీ


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: రహదారి భద్రతా వారోత్సవా ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం రవాణాశాఖ ఆధ్వర్యంలో భారీగా వాహనాల ర్యాలీ జరిగింది. ఈ నెల 1 నుంచి వారం రోజులపాటు ఈ రహదారి భద్రతా వారోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వాహన చోదకులు, పాదచారులు, విద్యార్థులు, ఇతరులు వాహనాలను జాగ్రత్తగా నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించడం, మద్యం సేవించి వాహనాలను నడపకుండా ఉండడం, మితిమీరిన వేగం లేకుండా ఉండడం తదితర జాగ్రత్తలు, సలహాలు, సూచనలను కరపత్రాలు, ఫ్లెక్స్‌ బోర్డులు, బ్యానర్లు ద్వారా అధికారులు ప్రజలకు తెలియజే శారు.భద్రతా వారోత్సవాల ముగింపు రోజైన గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భక్తవత్సలనగర్‌లోని ఆర్టీఎ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ వై.జయకుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో కార్లు, ఆటోలు, టెంపోలు, స్కూటర్‌లు, ఆర్టీసి బస్సులు, టాటా ఏస్‌, తదితర 180 వాహనాలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీ ఆర్టీఎ కార్యాలయం నుంచి బయలుదేరి అయ్యప్పగుడి, వేదాయపాళెం, కొండాయపాళెం గేట్‌, ఆర్టీసి, విఆర్‌సిల మీదుగా గాంధీబొమ్మ వరకు సాగింది. ఈ ర్యాలీలో డిటిసి వై.జయకుమార్‌రెడ్డి, ఆర్టీఒ రాంప్రసాద్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్లు కెజి.కృష్ణంరాజు, ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ఎఎన్‌విఐ గోపీనాయక్‌, ఆర్టీఎ కార్యాలయ ఎఒ కరీం, ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బోగస్‌ కార్డుల ఏరివేత వేగవంతం చేయండి


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: జిల్లాలో కొనసాగుతున్న బోగస్‌ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ బినామీ లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాలను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ సంజయ్‌జాజు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులతో బోగస్‌ కార్డుల ఏరివేత కార్యక్రమాలపై వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న గ్రామసభల్లో మొదటి విడత సర్వేలో తమ కార్డులు రద్దు చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ సరిగా నిర్వహించాలని సూచించారు. ఫిర్యాదిదారుల వాదన సరైన పక్షంలో విచారణ జరిపి వారి కార్డులు రద్దు కాకుండా చూడాలన్నారు. అదే విధంగా రెండవ విడత పూర్తయిన సర్వేకు సంబంధించి ఈనెల 16వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే అమలవుతున్న తీరుతెన్నులనను అడిగి తెలుసుకొని, సర్వేలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, డిఎస్‌ఓ జ్వాలాప్రకాష్‌, హౌసింగ్‌ డిఎం సత్యనారాయణ, ఎఫ్‌సిఐ అధికారులు పాల్గొన్నారు.

అరుదైన హృద్రోగ శస్తచ్రికిత్స


నెల్లూరు రూర ల్‌,మేజర్‌న్యూస్‌:ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ఏ వైద్యశాలలో ఇప్పటి వరకు నిర్వహించని అరుదైన హృద్రోగ శస్తచ్రికిత్స తమ హాస్పిటల్‌లో నిర్వహించినట్లు నారాయణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చింతారెడ్డిపాళెంలో గల నారాయణ హాస్పిటల్‌ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరుకు చెందిన రత్నమ్మ అనే 30 ఏళ్ల మహిళ హైపర్‌ట్రాఫిక్‌ ఆబ్‌ స్ట్రక్టివ్‌ కార్డియోమయోపతి వ్యాధితో బాధపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటళ్లలో చికిత్సకు ప్రయత్నించి చివరకు తమ వైద్యులను సంప్రదించినట్లు తెలిపారు. ఈమెను పరీక్షించిన తమ హాస్పిటల్‌లోని హృద్రోగ వైద్యనిపుణులు డాక్టర్‌ భక్తవత్సలరెడ్డి, డాక్టర్‌ ఫణికృష్ణలు ఈమెకు గుండె కవాటం మూసుకుపోయినట్లుగా గుర్తించి, తొలుత సంబందిత కండరాలు వాపు తగ్గించే ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆల్కాహాల్‌ అబ్లేషన్‌ అనే శస్తచ్రికిత్స నిర్వహించి రోగిని పూర్తి ఆరోగ్యవంతురాలిని చేసినట్లు ఆయన పేర్కొన్నారు.అనంతరం హాస్పిటల్‌ సిఇఒ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ పేదరాలైన ఈ రోగి ఇదే శస్తచ్రికిత్స ఇతర హాస్పిటల్‌లో చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అయ్యేదని, కాని తమ హాస్పిటల్‌లోని అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా శస్తచ్రికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈమెకు ఆరోగ్యశ్రీ వర్తింపచేసినందువల్ల సంబంధిత రోగివద్ద ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరుదైన శస్తచ్రికిత్సను అతి సునాయాసంగా, విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ రామ్మోహన్‌, డాక్టర్‌ భక్తవత్సలరెడ్డి, డాక్టర్‌ ఫణికృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఛిద్రమైన మధ్య తరగతి బతుకులు


గూడూరు, (మేజర్‌న్యూస్‌) : రాను రాను మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా తయారవుతోంది. ఇటు ఆదాయంలో పెరుగుదల లేకపోయె, ఇటు ప్రభుత్వ సాయం కోసం చేయి చాపలేరు. ఒకవేళ అర్ధించినా అర్హులు కారనే నెపంతో మొండిచేయి చూపుతుండె. ఇక ఎలా జీవనం సాగించాలో అర్థం కాక నిత్యం మానసిక సంఘర్షణకు లోనవుతూ ఎలాగోలా గత్యంతరం లేని బతుకులీడుస్తున్నారు. స్వాంత్య్రం సిద్ధించిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. అదేవిధంగా పిల్లల చదువులు, వైద్యం ఇలాంటి తప్పనిసరి ఖర్చులు కూడా మోయలేని భారంగా తయారయ్యాయి. వీటికి తోడు తాజాగా రవాణా చార్జీలు పెంపు. ఇలా ఏ రంగంలో తీసుకున్నా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇక రాబోయే బడ్జెట్‌లో ఎన్ని రకాలుగా వడ్డనలు జరుగుతాయో తెలియని పరిస్థితి.సాధారణంగా సమాజంలో మూడు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి ధనికులు, తరువాత మధ్య తరగతి, పేదలు. ఇందులో మొదటి వర్గానికి చెందిన ధనికులు జనాభాలో తక్కువ శాతం మాత్రమే ఉంటారు. ఈ ధరల పెరుగుదల వారికి ఏవిధమైన భారమూ కాదు. ఇకపోతే పేదల విషయానికి వస్తే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది, అంతేగాక ఆదాయ వనరులు కూడా కొంతమేర మెరుగుపడ్డాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకండా మనుగడ సాగించగలరు. ఈ రెండు వర్గాలనూ మినహాయిస్తే సమాజంలో అత్యధిక శాతం మధ్య తరగతి ప్రజానీకానిదే. వీరి పరిస్థితే వర్ణనాతీతంగా తయారైంది. అటు ప్రభుత్వం నుండీ ఏదీ అందదు, పన్నులు చెల్లింపూ అనివార్యం. ఈ కోణంలో పాలక, అధికార యంత్రాంగాలు ఆలోచించిన దాఖలాలు లేవు. కులాల్నే అగ్రవర్ణాలు, దళితులు అని రెండుగా చీల్చుకుని నాయకులు ఆయా కులాల ప్రాపకం కోసం ఏవేవో చేసుకుంటూ పోతున్నారు. ప్రభుత్వోద్యోగులు కూడా మధ్య తరగతి కుటుంబీకుల్లో అత్యల్ప శాతం మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగుతూ వస్తే రాబోయే కాలంలో మూడు వర్గాలూ ఉన్నా స్థాయి మాత్రం మారుతుంది. ధనికులు, పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు అధిక శాతం నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి పొంచి ఉంది. అసలు ఈ ధరలు నియంత్రణ లేకుండా ఎందుకు పెరుగుతున్నాయనే విషయం ఎవరూ ఆలోచించడం లేదనే అభిప్రాయం మధ్య తరగతి ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉంది. ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసం అని ఉద్యమాలను భుజాన వేసుకుని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సుడిగుండంలోకి తీసుకెళ్తున్నారు. కానీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నేడు సామాన్య ప్రజల జీవన పరిస్థితులపై ఉంది. గత కొద్ది నెలల క్రితం వరకూ రవాణా శాఖ ఆదాయంలో ఉంది. కానీ నేడు నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాలను అధిగమించేందుకు చార్జీల పెంపే మార్గం అని ఇష్టారీతిన పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కారణం సంస్థలోని అధికారులా లేక ప్రభుత్వమా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివిధ దశల్లో పరిస్థితిని పరిశీలించి సమగ్రంగా సమీక్షించి లోపాన్ని గుర్తించి తగిన చర్యలు చేపట్టినట్లయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు జీతాలు పెంపు విషయం సహేతుకమే కావచ్చు. కానీ ఆ మేరకు ఫలితాలు, రాబడిని కూడా అందుకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్‌, తక్కువ పన్నులతో అభివృద్ధి పథంలో పయనిస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దేశంలో అతి పెద్ద మొత్తంతో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో సాధించిందేమిటో అంతుబట్టడం లేదు. ఇటీవల సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని కేంద్రం ముందు వాపోవడం చూస్తుంటే ఈ లక్ష కోట్ల బడ్జెట్‌ అనేది కేవలం అంకెల గారడీగానే భావించాల్సి వస్తోంది. ఒక వైపు బడ్జెట్‌లో అధిక శాతంలో ఎక్కువ మొత్తం కేటాయించిన ప్రాజెక్టులు అయితే ఏ మాత్రం పనిజరగడం లేదు, మరి ప్రాజెక్టులకు వెచ్చించాల్సిన మొత్తం ఏమైనట్లో. ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రాంతాల వారీగా నాయకులు నిత్యం వల్లె వేస్తున్న వీరికి ప్రజల కష్టాలు వీరికి పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా జె.ఎ.సి.లుగా రూపాంతరం చెంది అటు సమైక్యం, మరో వైపు విభజనకు పోటా పోటీలు పడుతున్నారు కానీ ఈ విషయంలో ఎందుకు ఈ విధమైన చర్యలు చేపట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం కొద్ది సంవత్సరాల కాలంలోనే వారి గౌరవ వేతనాలు కూడా నాలుగురెట్లు చేసుకున్నారు.కానీ మధ్య తరగతి కుటుంబీకుల పరిస్థితి మాత్రం వీరు ఆలోచించరు. నిత్యం కోర్టులు చొరవ చూపుతూ అనేక విషయాలను పరిరక్షిస్తున్నా ధరల విషయంపై మాత్రం దృష్టి సారించకపోవడంతో యంత్రాంగం ధరల నియంత్రణ గాలికి వదిలేసినట్లుంది. మానవ హక్కుల ఉల్లంఘన క్రింద పాలకులను దోషులుగా చేయడం కూడా సబబేనేమో అనిపిస్తోంది. మానవుని ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కునే పాలక, అధికార యంత్రాంగాలు హరించి వేస్తున్నాయి. ఆత్మహత్యల వరకూ తీసుకెళ్తున్నాయంటే ఇక ప్రజాస్వామ్యంలో పాలన, ప్రజల కోసం, ప్రజల చేత అనేది ప్రహసనంగానే తయారైంది. కనీసం ఇకనైనా వ్యవస్థలో సమూల మార్పుల కోసం నాంది పలికేందుకు పాలక, అధికార యంత్రాంగాలు దృష్టి సారిస్తే భవిష్యత్తులో పొంచిఉన్న విపత్తులు, అరాచకాలను నిరోధించే అవకాశం ఉంది. లేదంటే దుష్పరిణామాలు అనివార్యం అనిపిస్తోంది.

రిలయన్స్‌ సంస్థలపై విరుచుకపడ్డ కాంగ్రెస్‌


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మృతిలో రిలయన్స్‌ యాజమాన్యం హస్తం ఉందంటూ రష్యన్‌ మేగజైన్‌లో ఒక కథనం వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లా వ్యాప్తంగా రిలయన్స్‌ సంస్థకు చెందిన పలురకాల వ్యాపార సంస్థలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు గురువారం రాత్రి 9.30 గంటల నుంచి విరుచుకపడ్డారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో ఉన్న రిలయన్స్‌ వెబ్‌ వరల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఎల్‌సిడిలు, టివిలు, మానిటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ధ్వంసం చేయడంతోపాటు కొంత సామాగ్రిని రోడ్డుపై వేసి తగలబెట్టారు. ఈ దాడుల వ ల్ల సుమారు రూ.5 లక్షల మేర విలువ చేసే పరికరాలు ధ్వంసం అయ్యాయని సంబంధిత ఉద్యోగులు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు రిలయన్స్‌ సంస్థలపై దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం తెలియగానే ముందుగా రిలయన్స్‌ వెబ్‌వ రల్డ్‌ వద్దకు ఒకటవ నగర పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు చేరుకుని దుకాణాన్ని మూసివేయమంటూ చెబుతుండగానే సుమారు వంద మందికి పైగా కాంగ్రెస్‌ కార్యకర్తలు మూకుమ్మడిగా వచ్చి క్షణాల్లో అక్కడి వస్తువులను, పరికరాలను ధ్వంసం చేశారు. అనంతరం ట్రంకురోడ్డులో రోడ్డు డివైడర్లపై ఏర్పాటు చేసివున్న రిలయన్స్‌ సంస్థకు చెందిన అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులను ధ్వంసం చేశారు. వెంటనే కెవిఆర్‌ పెట్రోల్‌బంకు వద్ద గల రిలయన్స్‌ సూపర్‌మార్కెట్‌పై కార్యకర్తలు దాడికి పాల్పడేందుకు వస్తుండగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తుగా ఉండడంతో కార్యకర్తలు వెనుదిరిగారు. నెల్లూరు నగరంలో కాంగ్రెస్‌పార్టీ మైనారిటీ నేతలు ఈ దాడులకు పాల్పడడం గమనార్హం. కార్పొరేటర్‌ అబ్దుల్‌ మునాఫ్‌, మైనారిటీ నేత ఆసిఫ్‌పాషాల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మునాఫ్‌ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రియతమ నేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని రిలయన్స్‌ యాజమాన్యం పొట్టనపెట్టుకుందనే వార్తను తాము జీర్ణించు కోలేకున్నామన్నారు. ఈ క్షణం నుంచి తాము రిలయన్స్‌ సంస్థకు చెందిన ఉత్పత్తులను ఏమీ ఉపయోగించమని, తాము వినియోగిస్తున్న రిలయన్స్‌ సిమ్‌ కార్డులను కూడా వారు చించివేశారు. రాష్ట్రంలో ‘రిలయన్స్‌’ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని వారు హెచ్చరిక చేశారు. ఈ విషయంలో తాము ఎంతటి పనికైనా పూనుకుంటామని చెప్పారు. అదేవిధంగా కోవూరు సమీపంలోని జాతీయరహదారిపై ఉన్న రిలయన్స్‌ పెట్రోలు బంకును కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు.సమాచారం అందిన వెంటనే కోవూరు సిఐ విఎస్‌.రాంబాబు ఈ దాడులకు పాల్పడిన కోవూరు మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, విడవలూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా రిలయన్స్‌ సంస్థలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు నిర్వహించారు. జిల్లాలో కొన్నిచోట్ల ఈ దాడులు సంభవించినప్పటికీ పోలీస్‌శాఖ అప్రమత్తమై ముందు జాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా రిలయన్స్‌ సంస్థకు చెందిన పెట్రోల్‌ బంకులు, సెల్‌ఫోన్‌ టవర్లు, రిలయన్స్‌ కార్యాలయాలు, సూపర్‌మార్కెట్‌లు తదితర వ్యాపార సంస్థలవద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డి నగరంలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రిలయన్స్‌ సంస్థలపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడుల గురించి జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డితో మేజర్‌న్యూస్‌ ప్రస్తావించగా ఇలాంటి దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. శాంతి భద్రతలకు, రిలయన్స్‌ సంస్థ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. డిఎస్సీ రాధిక, నగర సిఐ పి.వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో రిలయన్స్‌ సూపర్‌మార్కెట్‌తోపాటు రిలయన్స్‌ సంస్థల వద్ద పోలీస్‌ బందోబస్తు కొనసాగుతోంది. టివీలలో డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రె డ్డి మృతి వెనుక రిలయన్స్‌ సంస్థ ప్రమేయం ఉందన్న వార్తలు ప్రజల్లో తీవ్ర కలకలాన్ని రేకెత్తించాయి.
సంయమనం పాటించండి : కోటంరెడ్డి ఈ విషయంపై ప్రజలు సంయమనం పాటించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో సూచించినట్లు పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు. ఇందులో నిజానిజాలు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Wednesday, January 6, 2010

గమ్యమెరుగని పాటల ప్రయాణం

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌: స్థిర నివాసం లేని నిరంతర పాటల శ్రామికుల పయనంలో మంగళవారం నగరంలో పలు కూడళ్లలో ఈ అంధులు ప్రజల్లో సంగీత వెలుగు రేఖలను రేకెత్తించారు. తమకు తామే మైకులు అమర్చుకుని కీబోర్డు, డోలక్‌లతో చక్కటి స్వరాలతో చుట్టూ చేరిన ప్రేక్షకులకు ఓ గొప్ప స్టార్‌ నైట్‌ను మించిన అనుభూతిని అందించారు. అంధత్వాన్ని అధిగమించి సాగుతున్న వారి సంగీత ప్రయాణంలో ప్రతి మలుపూ ఓ జీవిత పాఠాన్ని నే ర్పుతుందంటారు. మనో నేత్రంతో సృష్టిలోని అందాలను తిలకిస్తూ సంగీత సిరులను అందిస్తూ నేత్రాలున్నవారికి ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూ వీరు మాత్రం పాటలా సాగిపోతున్నారు. అభినందనల చప్పట్ల చప్పుళ్లతోపాటు ఆర్థికంగా ఆదుకోమంటూ జీవంలేని చెమ్మగిల్లిన కళ్లతో పాటల కందని గొప్ప సంకేతాన్ని మన కళ్లకు అందజేస్తున్నారు. ప్రజాదర ణే మమ్ములను నడిపిస్తుంది -- ప్రసాద్‌రైలు, బస్సులు, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇక్కడ పాటలు పాడిన ప్రజలు అత్యంత ఆసక్తితో మమ్ములని ఆదరిస్తున్నారని అంధుల వీధి కచ్చేరీలకు నాయకత్వం వహిస్తూ కీబోర్డు వాయిద్యకారుడు ప్రసాద్‌ పేర్కొన్నాడు. చిన్నప్పుడు పిల్లలతో ఆటల కొట్లాటలతో కళ్లు పోయిన తనకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తి జీవితానికి ఆసరాగా మిగిలింది. అదే ఆసక్తి గలవారిని కలుపుకుని ఒక జట్టుగా ఏర్పడి ఊరూరా ప్రదర్శనలు ఇస్తున్నాము.ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి -- హేమలత, కృష్ణఅంధులు చదువుకున్న తమకు ఉద్యోగాలు రాలేదని, ఊరూరు తిరుగుతూ పాటలతో జీవనం గడుపుతున్నామని పుట్టుకతో గుడ్డివారైన కృష్ణ, హేమలత దంపతులు తెలిపారు. హేమలత ఇంటర్‌ వరకు, కృష్ణ డి గ్రీ డిస్కంటిన్యూ చే సి పాటలు పాడుతూ బతుకును వెళ్ల దీస్తున్నాడు.నివాస స్థలాలు ఇప్పించండి -- పాపమ్మ, ఉండడానికి ఇల్లు లేక ఊరూరా తిరిగి పాటలతో పొట్టపోసుకుంటున్న తమకు ప్రభుత్వాధికారులు ఉండడానికి స్థలం ఇవ్వాలని భర్తను పోగొట్టుకున్న అంధురాలు పాపమ్మ కంటతడి పెట్టుకుంది. అంధుల పాలిటి చుక్కాణి ‘కుమారి’ఈ అంధుల అందరిని నడిపించే చిన్నారి కుమారి. చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలను భుజాన వేసుకుని ఈ అంధులందరినీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడిపిస్తుంది. ఫలితంగా బడికి వెళ్లి చదవుకోలేకపోయింది. అయినా చూపులేని తల్లితోపాటు మరో నలుగురికి మార్గం చూపే బృహత్తర కార్యాన్ని నెరవేరుస్తున్నాననే స్థైర్యం ఈ చిన్నారి కళ్లలో తొణికిసలాడుతోంది.కళ్లున్న మనుషుల కంటే కళ్లు లేకపోయినా దేవుడిచ్చిన స్వరంతో అందరికీ ఆనందాన్ని నింపుతూ, వారి బాధలను లెక్క చేయకుండా సాగిపోతున్న ఈ అంధుల పాటల పయనం ఒక స్థిరనివాస గమ్యాన్ని చేరుకోవాలని ‘సూర్య’ ఆశిస్తుంది.

పులికాట్‌ పూడికతీత ఉత్తిదే-నేలపట్టులో బొటానికల్‌ గార్డన్‌...

సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ : పులికాట్‌ సరస్సుని రామ్‌సైట్‌లో చేర్చి సరస్సు పూడికతీత చేస్తామని చెప్పిన నేతల మాటలు ఉత్తిగానే మిగిలిపోయాయి. సరస్సుని రామ్‌సర్‌ సైట్‌లో చేర్చలేదని, పులికాట్‌ పూడిక తీతకు సాంకేతిక అంశాలు అడ్డుగా ఉన్నాయని పులికాట్‌ సరస్సు ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ రితీష్‌ మల్హోత్రా తేల్చేచారు. పులికాట్‌ సరస్సుప్రాంతాన్ని మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరస్సును ఇంకా రామ్‌సర్‌సైట్‌లో చేర్చలేదని తేల్చేచారు. పులికాట్‌ పూడిక తీతకు కూడా సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రా, తమిళనాడు ప్రాంతంలో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సుని అభివృద్ధి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకు రావాలని, అక్కడివారు సరస్సు అభివృద్ధికి పెద్ద ప్రాధాన్యత నివ్వడం లేదని తెలిపారు. పులికాట్‌ పూడిక తీత కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి కేంద్ర నిధులు విడుదలైతేనే సాధ్యమని చెప్పారు. పులికాట్‌ సమీపంలోని నేలపట్టుని అన్ని విధాలా అభివృద్ధి పరిచి బొటానికల్‌ గార్డన్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలిపారు. నూరు ఎకరాలలో పార్కుని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే రూ. 100 కోట్లు వెచ్చించి నేలపట్టుని అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలిపారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం టూరిజంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పరసారత్నం, ఫారెస్టు, వన్యప్రాణి విభాగం అధికారులు మురళీకృష్ణ, మల్లిఖార్జున, నర్సింహారావు, సుబ్బనాచారి, ఎ సింగ్‌, డివి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బలవన్మరణం...అక్క కోసం ప్రాణాలిచ్చిన తమ్ముళ్లు


కావలి రూరల్‌, మేజర్‌న్యూస్‌: జీవితంపై విరక్తి చెంది తమ సోదరి సుభాషిణి(20) ఆత్మహత్య చేసుకోవడంతో జీర్ణించుకోలేని ఆమె సోదరులు కూడా పురుగు మందు సేవించి మృతి చెందిన సంఘటన మంగళవారం బోగోలు మండలంలోని కోవూరుపల్లి గ్రామంలో జరిగింది. బంధువుల కథనం మేరకు.. గ్రామంలోని మంగమ్మ, రమణయ్యల కుమార్తె సుభాషిణిని ఎఎస్‌పేట మండలం చిరమన గ్రామానికి చెందిన రాంబాబుతో వివాహం చేశారు. తరచూ కుటుంబ తగాదాల కారణంగా సుభాషిణి నాలుగు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు తన పుట్టింటికి వచ్చింది. అనంతరం భార్యభర్తల మధ్య సంబంధాలు లేకుండాపోయాయి. భర్త రాంబాబు ఇటీవల మరో వివాహానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సుభాషిణి మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పూనుకుంది. దీనిని జీర్ణించుకోలేని ఆమె సోదరులు దుర్గా ప్రసాద్‌(18), రాజ్‌కుమార్‌(15)లు ఆమెతో కలిసి పురుగు మందు సేవించారు. సమీపాన ఉన్న చెరువు గట్టుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు 108సిబ్బంది బాధితులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగమ్మ, రమణయ్యలకు నాలుగురు సంతానం కాగా, వారిలో చివరి కుమారుడయిన శివక్రిష్ణ ఒక్కడే మిగిలాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh