గ్రామం నుంచి బయటకు రావడంలేదు
ఆరుగంటలైతే తలుపుల మూత
అవి అపోహలు: డాక్టర్ దత్తాత్రేయులు
మనుబోలు: హైటెక్ యుగంలోనూ దెయ్యం భయం జనాన్ని వీడడంలేదు. పుకార్లతో ప్రజలు భయపడుతున్నారు. మండలంలోని బండేపల్లి గ్రామస్తులను దెయ్యం భయం వెంటాడుతోంది. గ్రామంలో 180 కుటుంబాలున్నాయి. 700 జనాభా ఉంది. మార్చి నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో వివిధ కారణాలతో ఆరుగురు హఠాత్తుగా మృతిచెందారు. వారిని ఓ శక్తి మింగేసిందనే పుకార్లు వచ్చాయి. కొందరు తమకు దెయ్యం కనిపించిందని ప్రచారం కూడా చేశారు. దీంతో ప్రజలు గ్రామం నుండి బయటకు రావడం మానుకున్నారు. సాయంత్రం ఆరుగంటలైతే అన్ని పనులు చేసుకొని తలుపులు మూసుకొని ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ గ్రామాన్ని సందర్శించింది. ఆరుగురు ఏ కారణాలతో చనిపోయారనే వివరాలను సేకరించింది. మార్చిలో శివనాయుడు అనారోగ్యంతోనూ, పద్మమ్మ గుండెపోటుతోనూ, మరో వృద్ధురాలు వయోభారంతోనూ మృతిచెందారు. ఏప్రిల్లో నాగమణి, రాజగోపాల్, ప్రతాప్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అయితే వారిని దెయ్యం మింగేసిందని ప్రచారం జరగడంతో గ్రామం నుండి ఎవరూ బయటకు రావడంలేదు. తెల్లచీర కట్టుకున్న ఓ యువతి రక్తం తాగుతానని అంటోందని పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇకనైనా జెవివి వంటి సంస్థలు ప్రజల్లో చైతన్యం కలిగించి వారిలో నెలకొన్న భయాందోళనలు తొలిగించాల్సి ఉంది.
అవి అపోహలు: జెవివి
గ్రామంలో దెయ్యం తిరగడం, శక్తి ఉందని అనడం వట్టి మూఢ నమ్మాకాలనీ, అపోహలని జెవివి జిల్లా నాయకులు, డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల డాక్టర్ దత్తాత్రేయులు అన్నారు. బండేపల్లిలో గ్రామంలో దెయ్యం తిరుగుతుందనే విషయమై ప్రజాశక్తి ఆయన్ను ఫోన్లో వివరణ కోరగా పై విధంగా స్పందించారు. ఎవరో స్వార్థం కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. దెయ్యాలు లేవని తాము శాస్త్రీయంగా నిరూపిస్తామని తెలిపారు. తాము నేరుగా ఆ గ్రామానికెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు.