రాపూరు : పెంచలకోన బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పాలకమండలి, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. పూల తోటలోని ప్రత్యేక మండపంలో అలయ అర్చకులు పుట్టమట్టి తీసుకొచ్చి నవధాన్యాలతో కలశస్థాపనతో ఉత్సవాలకు అంకుర్పారణ చేశారు. యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం ఆలయంలో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. 'కోన'కు చేరిన ఉత్సవ మూర్తులు గోనుపల్లి ఆలయం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పల్లకిలో ఊరేగింపుగా మంగళవారం పెంచలకోనకు తీసుకొచ్చారు. తొలుత గోనుపల్లి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రతే ్యక పూజలు చేశారు. పల్లకిలో ఉత్సవమూర్తులను బోయలు మోస్తూ ఆరు కిలోమీటర్ల దూరంలోని పెంచలకోనకు కాలినడకన తీసుకురావడం విశేషం. ఉత్సవమూర్తులకు గొల్లబోయి ఆలయం వద్ద విశేష పూజలు చేశారు. అనంతరం గోనుపల్లిలోని గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. శ్రీవారిని తమ ఇంటి అల్లుడుగా భావించిన గిరిజనులు పుట్టతేనే, అటవీ దుంపలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను కోనకు తీసుకొళ్లి అమ్మవారి ఆలయం వద్ద విశేష పూజలు జరిపించారు. ఉత్సవ మూర్తులు కోనకు చేరడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. విద్యుద్దీపాలంకరణ శ్రీవారు, ఆదిలక్ష్మి, ఆంజనేయాస్వామి వారి ఆలయాలు, కొండాకోనలను విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవుడు, దేవేరి ఆలయాల నడుమన ఉన్న పెద్ద కొండపై విద్యుద్దీపాలతో ఏర్పాటుచేసిన నామాలు, శంఖుచక్రాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. పెంచలకోనలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీవారికి ఉభయకర్తలు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం శ్రీవారు, ఆంజనేయస్వామికి పూలాంగిసేవ నిర్వహిస్తారు. 8 గంటలకు తిరుచ్చి ఉత్సవం, 11.20 గంటలకు ధ్వజారోహణం, మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తి రుమంజనం, సాయంత్రం 5.30 గంటలకు సహస్రదీపాలంకరణ సేవ, రాత్రి 10 గంటలకు శేషవాహనంపై శ్రీవారి క్షేత్రోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. రాత్రికి భక్తులకోసం సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
No comments:
Post a Comment