నెల్లూరు, ప్రతినిధి:భారతీయులు ఉలిక్కి పడేలా, తలచుకుంటేనే భయభ్రాంతులకు గురఇయ్యే హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ బాంబు పేలుడు ముద్దాయిలుగా దేశద్రోహులుగా గుర్తించబడిన వారికి జిల్లా కేంద్రకారాగారంలో ఇటీవల రాజభోగాలు అందుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. చెమటోడ్చి కష్టపడి పోలీసులు పట్టుకొని దేశద్రోహులుగా ముద్రించి చర్లపల్లి జైలు నుంచి నెల్లూరు జైలుకి తరలిస్తే ముడుపులకు ఆశపడి ఇక్కడ కొంతమంది అధికారులు సిబ్బంది ఆ కఠినాత్ములకు రాచమర్యాదలు చేయడం సభ్యసమాజం తలదించుకొనేలా వుందని పలువురు వాపోతున్నారు. చూడటానికి నిర్మలంగా ఉండే జియాఉల్ హుక్, ఆలీభాయి, సిరాజుద్దున్, ఖ్రుషీలు అతి సులువుగా ప్రాణాలు తీయడంలో దిట్టలే గాక బాంబు పేలుళ్ళు ప్రణాళిక చేయడంలో రాక్షసులు.
ఇలాంటి దేశద్రోహులకు ఎంత శిక్ష వేసినా సరిపోదు అలాంటి వారిని వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరినొకరు మాట్లాడకుండా చేయాల్సింది పోయి వారు కలసిమెలసి వుంచడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. కేవలం ఉగ్రవాదులకు సంబంధించిన వారు అధికారులకు, సిబ్బందికి భారీ మొత్తంలో ముడుపులు అందించడం వల్లనే ఈ దేశద్రోహులను స్వేచ్ఛగా వుంచుతున్నారని జైలులోని కొంతమంది గుసగుసలాడుతున్నట్టుగా సమాచారం. దీనికి తోడు ఏకంగా కారాగారంలోని ఉగ్రవాదులకు ఉగ్రవాద సాహిత్యంకు సంబంధించిన పుస్తకాలు అందుతున్నాయని వినికిడి.
అంతేగాక ఇటీవల జరిగిన ముంబాయి దాడులుకు సంబంధించిన చర్చలును సెల్‌ఫోన్‌లు ద్వారా ఈ ద్రోహులు ఇక్కడినుండే చర్చలు చేసినట్టుగా తెలిసింది. ఇటువంటి కఠినమైన కర్కశులకు మన కేంద్రకారాగారంలో కొంతమంది సహకరించడం శోచనీయమని పలువురు భావిస్తున్నారు. కేవలం డబ్బులకు ఆశపడి ఖైదీ ఎలాంటి వాడన్న సంగతికూడా మరచి వైద్యం అవసరం లేకపోయినా వారిని ప్రభుత్వ వైద్యశాలకి పంపడమే కాక వారికి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా వారికి ఆనారోగ్యంగా ఉందని వారికి విశ్రాంతి అవసరమని చెబుతూ ధృవీకరించేటట్టుగా అటు వైద్యులు ఇటు జైలు సిబ్బందిలు కుమ్మక్కుకావడం నిత్యకృత్యం అయింది. అయితే ఇంత జరుగుతున్నా నిఘా విభాగం దీని గురించి పట్టించుకోకుండా కేవలం రాజకీయ నాయకులకు అవసరమైన సమాచారాన్ని అందించే శాఖగానే మిగలడం హాస్యాస్పదం. ఎంతోమందిని బాంబు పేలుళ్ల ద్వారా చంపిన ఇలాంటి కిరాతకులకు రాజభోగాలు కనిపించకుండా, కారాగారంలో బాధలే కనపడాలి, ఈ తప్పు ఎందుకు చేశానా అని కుమిలి కుమిలి చచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనావుంది.