నెల్లూరు :కేద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఏకపక్ష తీర్మాణం చేస్తే సీమాంధ్రలో తీవ్ర పరిణామాలు తప్పవని సమైక్యాంధ్ర విద్యార్ధి జె ఎసి హెచ్చరించింది. శుక్రవారం నగరంలోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలో గల జాతీయ రహదారిపై జెఎసి మానవహారంగా ఏర్పడి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. జెఎసి రాష్ట్ర కో-కన్వీనర్ డివి. కృష్ణయాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వలన వేర్పాటు వాదుల స్వార్ధ ఉద్యమాలకు ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రభుత్వం తలకిందుల నిర్ణయాలను ఇప్పటికైనా కట్టిపెట్టి వేర్పాటువాద ఉద్యమాలకు చరమగీతం పలకాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమాంధ్రులు కట్టే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ సహాయ నిరాకరణ చేస్తామని తెలంగాణ ఉద్యోగ జెఎసి పేర్కొనడంలో అర్ధం లేదన్నారు. జీతాలు తీసుకోకుండానే ఉద్యమాలు చేయాలని వారికి సూచించారు. ప్రభుత్వంపై బ్లాక్‌మెయిలింగ్ ప్రకటనలు చేస్తున్న తెలంగాణా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం వారిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ఏకపక్ష తీర్మాణం చేస్తే సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై మరో వారంలోపు 14 యూనివర్సిటీల విద్యార్ధి జెఎసి ప్రతినిధులు విశాఖపట్నంలో సమావేశమై ఉద్యమాల తీవ్రత పెంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ ఆచార్య ఆదిత్య, టోనిబాబు, ఆదిత్య సాయి, అనిల్, చరణ్ తదితర జెఎసి నాయకులు పాల్గొన్నారు.