online marketing

Friday, February 19, 2010

రేపే గంథోత్సవం

తడ, మేజర్‌నూస్‌ : ఆదివారం వేనాడులో వైభవంగా జరగనున్న గంథోత్సవానికి ఏర్పాట్లన్ని పూర్తయినాయి. ఏర్పాట్లపై శుక్రవారం తడ ఎస్‌ఐ హరికృష్ణ దర్గా వద్దకు వెళ్లిభద్రతపై గ్రామస్తులతో చర్చించారు. వేనాడుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపధ్యంలో ముందు జాగ్రత్తగా వాహనాలకు పార్కింగ్‌లతోపాటు ఆకతాయిలనుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత చర్యలుపై ఉరుసు నిర్వాకులతో చర్చించారు. శుక్రవారం నుంచే దర్గా వద్ద విద్యుత్‌ దీపాల అలంకరణతో పాటు కిలో మీటరు పొడవున సుందర వనంగా సీరియల్‌ సెట్లను అలకరించారు. గంధోత్సవం దగ్గరకు రావడంతో గురువారం నుంచే దర్గా వద్ద భక్తుల తాకిడి అధికంగా వుంది.ఆసియా ఖండంలోనే అతిపెద్ద దర్గాగా పేరుగాంచి 144 అడుగుల పొడవుతో స్వయంభుగా వెలసిన ఈ అల్లాతాత దర్గాను 1996లో తొలిసారిగా అస్కార్‌ అవార్డు గ్రహీత, సినీ సంగీత దర్శకులు ఎఆర్‌ రెహమాన్‌ సందర్శించారు. ఈదర్గాను సందర్శించినంతరం ఆయనకు కాలం కలసి రావడంతో పాటు దర్గాయొక్క ప్రాముఖ్యత నాలుగు దశలకు వ్యాపించింది. అప్పటి నుండి వారి కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో గంథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. గంధోత్సవాన్ని పురష్కరించుకొని 5రోజుల క్రితం జెండా ఆవిష్కరణ అంగరంగ వైభంగా చేశారు. ఆదివారం రాత్రి గ్రామంలో ఉరేగింపుగా ఉత్సవం నిర్వహించి అర్థరాత్రి గంధోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు ఎఆర్‌ రెహమాన్‌ దర్గాను సందర్శించే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన అవసరం

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:సమాచార హక్కు చట్టంపై ఇప్పటికే ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందని, అయితే దీనిని వినియోగించుకునేందుకు మరింత అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నగరంలోని సమాచార హక్కు సంఘం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత నాలుగేళ్లుగా ఈ చట్టం ఏర్పాటైనప్పటి నుంచి మూడేళ్లకు సంబంధించిన వార్షిక నివేదికలను తాము ప్రభుత్వానికి అందజేశామని, ప్రస్తుతం 2010 సంవత్సర వార్షిక నివేదిక అందవేత పనిలో ఉన్నామన్నారు. సమాచార హక్కు చట్టంపై వస్తున్న దరఖాస్తుల సంఖ్యతోపాటు అందులోని నాణ్యత కూడా పెరిగిందన్నారు. సమాచారాన్ని అందజేయాల్సిన అధికారులు సమాచారాన్ని ఇస్తున్నారు కాని జాప్యం మాత్రం జరుగుతున్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేకాకుండా దరఖాస్తుదారునికి అరకొర సమాచారం ఇస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 29 సమాచార హక్కు చట్టం కమిషన్లు ఉండగా అందులో రాష్ట్రానికి చెందిన తమ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదికలు అందజేయడంలో ముందంజలో ఉందన్నారు. సమాచార హక్కు చట్టంపై కోర్టులకు ఎలాంటి అధికారం లేదని, అయితే చట్టం కమిషనర్‌ ఇచ్చిన తుది నిర్ణయంపై సంబంధిత దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేలకు పైగా దరఖాస్తులు అందాయని, అందులో 87 శాతం దరఖాస్తులు ఇప్పటికే పరిష్కారమయ్యాయన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చె ప్పారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,639 దరఖాస్తులు రాగా వాటిలో 3,383 దరఖాస్తులు పరిష్కారమయ్యాయన్నారు. అదేవిధంగా 343 అప్పీళ్లు రాగా వాటిలో 304 పరిష్కారమయ్యాయని చెప్పారు.సమాచార హక్కు చట్టం పై ఇప్పటికే రాష్ట్రంలో 12 సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తాను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 650 సమావేశాలకు హాజరయ్యామని చెప్పారు. సమాచార హక్కు చట్టంపై రెండు వైపులా చైతన్యం పెరిగిందని, సమాచారం అడిగేవారితోపాటు ఇచ్చే వారికి బాధ్యత పెరిగిందన్నారు. అయితే కొన్నిచోట్ల రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. నెల్లూరులో ఇది తన మూడవ పర్యటన ని, గతంలో కన్నా ప్రస్తుతం తనకు మార్పు కనిపించిందని, అయితే ఆ మార్పు మరింత పెరగాలన్నారు. సమాచారహక్కు చట్టం ప్రచారంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ప్రచారం చేసే పని ప్రభుత్వానిదని చెప్పారు. విలేకరుల సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, డిఆర్‌ఒ జివి.జయరామయ్యలు పాల్గొన్నారు.

15 లక్షల రూపాయల విలువచేసే

కోవూరు, (మేజర్‌ న్యూస్‌) : కోవూరు సమీపంలోని ఆర్‌కె పెట్రోల్‌బంక్‌ ఎదురుగా జాతీయ రహదారిపై కంటైనర్‌లో అక్రమంగా తరలివెళుతున్న 15లక్షల రూపాయల విలువచేసే రెక్టి ఫైడ్‌ స్పిరిట్‌ను ప్రొహిబిషన్‌, ఎకై్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌వై ఖురేషి నేతృత్వంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది నిఘావేసి శుక్రవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ టి.ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంటైనర్‌లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రేవా నుంచి కేరళ రాష్ట్రంలోని కొల్లామ్‌కు అక్రమంగా స్పిరిట్‌ తరలివెళుతుందని సమాచారం రావడంతో సిబ్బంది రెండురోజులపాటు నిఘావేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పర్మిట్లలో రేవాలోని తేర్‌మాక్స్‌ ట్రేడ్‌ లిమిటెడ్‌ నుంచి డెకోర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొల్లామ్‌కు ‘‘వీణా’’ సోప్స్‌ పేరుతో బిల్లులు వ్రాసియున్నట్లు ఆయన తెలిపారు.సిబ్బంది తనిఖీలు నిర్వహించగా కంటైనర్‌లో 35 లీటర్ల క్యాన్లలో స్పిరిట్‌ ను నింపి, అదే సైజులో అట్టపెట్టెలలో పెట్టి రవాణా చేస్తున్నారు. ఈ స్పిరిట్‌ను నాటుసారా తయారీకి ఉపయోగిస్తారని, ఇందులో 97శాతం ఆల్కాహాల్‌ వుంటుందని చాలా ప్రమాదకరమన్నారు. ప్రస్తుతం బ్రాందీషాపులలోని విస్కీ, బ్రాందీలలో ఆల్కాహాల్‌ 42 శాతం వుంటుందన్నారు. పర్మిట్లలో వ్రాసినట్లు కేరళకు కాకుండా తమిళనాడులో స్పిరిట్‌ను చేరవేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో స్మగ్లింగ్‌ చేసేవాళ్ళు ట్యాంకర్ల ద్వారా తరలించేవారని, నిఘా పెరగడంతో ఇలా కంటైనర్లలో ప్యాకింగ్‌ చేసి తరలిస్తున్నారు. అలాగే చండీఘర్‌కు చెందిన ఈ కంటైనర్‌లో సిజి 14 4573, జిజె 6 ఎక్స్‌ 3275 నెంబర్ల ప్లేట్లు, 2సి బుక్‌లు వున్నట్లు కనుగొన్నారు. ఈ కంటైనర్‌లో 433 క్యాన్లు 35 లీటర్లవి వున్నవని, అందులో 15వేల లీటర్ల రెక్టి ఫైడ్‌ స్పిరిట్‌ వుంటుందన్నారు. వీటి ధర 15 లక్షలు, లారీ విలువ 5లక్షలు మొత్తం 20 లక్షల రూపాయలని వీరు అంచనా వేశారు. చంఢీఘర్‌లోని రాయపూర్‌ ప్రాంతానికి చెందిన కంటైనర్‌ డ్రైవర్‌ కులదీప్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కోవూరు ప్రొహిబిషన్‌, ఎకై్సజ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ స్మగ్లింగ్‌ను నిఘావేసి ఛేదించిన సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఎకై్సజ్‌ సూపరిండెంట్‌ ఎస్‌ఎంకెఎమ్‌ బాషా, ఎఇఎస్‌ మురళీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐలు ప్రసాద్‌, నజీర్‌, కోటేశ్వరరావు, విజయ, సరోజిని, ఎస్‌ఐలు పి.విజయకుమార్‌, ఎం.సురేంద్ర, ఎం.వీరాస్వామి, సాయికృష్ణ, కోవూరు ఎకై్సజ్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

దంపతుల బలవన్మరణం

విడవలూరు, (మేజర్‌ న్యూస్‌) : డెంగీ జ్వరంతో కుమార్తె మరణించిందని మనస్థాపం చెందిన దంపతులు విషపు గుళికలు తిని బలవన్మరణనానికి పాల్పడిన సంఘటన గురువారం విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో జరిగింది. టెక్కం సుధాకర్‌ (49), దేవసేన (44)లు చనిపోయి వుండగా స్థానికులు కనుగొన్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. సుధాకర్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా అందులో ఒకరైన సురేఖను విడవలూరులోని తుపాకుల మధుసూధనరావుకు ఇచ్చి వివాహం చేశారు. ఆమె సంవత్సరం క్రితం ఆరోగ్యం బాగాలేక మృతిచెందింది. ఈ నేపథ్యంలో రెండవ కుమార్తె ఎర్రంశెట్టి సుమలత (28)ను పార్లపల్లిలోని మల్లికార్జునకు ఇచ్చి వివాహం చేశారు. ఈమె కూడా డెంగీ జ్వరం రావడంతో 16 రోజుల క్రితం చికిత్స నిమిత్తం చెనై్నలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం సాయంత్రం మృతిచెందింది. కూతురు పరిస్థితి విషమంగా వున్నప్పుడు చెనై్న నుండి ఆమె తల్లిదండ్రులైన సుధాకర్‌, దేవసేనమ్మలు స్వగ్రామమైన ఊటుకూరుకు వచ్చారు. గతంలో ఒక కూతురు మృతి చెందగా, రెండవ కుమార్తె కూడా మర ణించడంతో తీవ్రమనస్థాపానికి గురై విషపుగుళికలు నీళ్ళలో కలిపి త్రాగారు. కుమార్తె అంత్యక్రియల కోసం తల్లిదండ్రుల కోసం పార్లపల్లి నుండి ఊటుకూరు గ్రామానికి వెళ్ళిన వారు ఆ ఇద్దరు చనిపోయి వుండడం చూసి వారిని కలిచివేసింది. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నుంచి పల్లెపాళెం వెళ్ళేదారిలో ఇంటి మీద్దపై దేవసేన, క్రింద ఇంటిలో సుధాకర్‌లు మరణించి వుండగా కనుగొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని జరిగిన సంఘటన చూసి కలత చెందారు. కోవూరు సిఐ విఎస్‌ రాంబాబు, విడవలూరు ఎస్‌ఐ టిసి వెంకటయ్యలు అక్కడికి చేరుకొని శవపంచనామా చేశారు. జరిగిన సంఘటన గురించి చుట్టుప్రక్కల వారిని, మృతుల బంధువులను విచారణ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం దంపతుల మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కోళ్లకు కొక్కెర వ్యాధి నివారణ టీకాలు

కావలి రూరల్‌, మేజర్‌న్యూస్‌: నాటుకోళ్లకు శనివారం నుంచి 10లక్షల కొక్కెర వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ కెఎం రెహమాన్‌ వెల్లడించారు. గురువారం స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పశువుల ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10లక్షల కొక్కెర వ్యాధి నివారణ ఉచిత టీకాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎన్నుకున్న కమిటీలు శనివారం నుంచి జిల్లాలో విస్తృతంగా కోళ్లకు టీకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా 6లక్షల 24వేల పశువులకు ఇప్పటికే గాలికుంటు వ్యాధి టీకాలను వేశామన్నారు. 2లక్షల 10వేల పశువులకు బొబ్బ వ్యాధి నివారణ మందులను అందించామని చెప్పారు. అమ్మతల్లి, ఆటలమ్మ టీకాలను కూడా అందించామని చెప్పారు. గొర్రెలు, మేకలు మొత్తం 13లక్షలకు పైగా నట్టల నివారణ మందులను వేశామని తెలిపారు. అదే విధంగా డివిజన్‌లో 85పశు సంవర్ధక కేంద్రాలు ఉన్నాయని వాటి ద్వారా మిగిలిన వాటికి కూడా మందులు అందించే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పశు క్రాంతి పథకం క్రింద జిల్లాలో 572గేదెలను లబ్దిదారులకు పంపిణీ చేశామని, డిసెంబర్‌ నెలాఖరు నాటికి మరో 500గేదెలను పంపిణీ చేయవలసి ఉందన్నారు. వీటికి అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయని ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. దీని యూనిట్‌ కాస్ట్‌ విలువ 35వేలు కాగా, బ్యాంకు నుంచి 20వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 15వేల రూపాయలు రైతులకు సబ్సిడీగా ఇవ్వబడుతుందని తెలిపారు. అయితే గేదెల ఎంపిక యజమని ఇష్టానుసారం ఏ ప్రాంతం నుంచైనా సిబ్బంది సమక్షంలో విక్రయించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్‌ సహాయ సంచాలకులు డాక్టర్‌ పి బ్రహ్మయ్య, డాక్టర్‌ బి పెద్దస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

Tuesday, February 16, 2010

ముగ్గురు కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : జిల్లాలో ముగ్గురు కాంట్రాక్టర్ల వల్ల జలయజ్ఞం ఆశయం మూలన పడిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. కాలువ పనుల్లో, జలయజ్ఞంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంటోందని, దీనివల్ల ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యాలకు గండి పడుతోందని ఆయన ఆరోపించారు. ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై ప్రశ్నలను లేవనెత్తనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం, అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి వంద ప్రశ్నలను అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రస్తావించాలని కోరుతూ అసెంబ్లీకి పంపించినట్లు ఆయన అన్నారు. సాధారణంగా ఎమ్మెల్యే కోరితే ఒక ప్రశ్నే చర్చకు వస్తుందని, గ్రూపు ప్రశ్నలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని అవన్నీ చర్చకు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. జిల్లాలో కాంట్రాక్ట్‌ పనులు కేవలం ముగ్గురు బడా కాంట్రాక్టర్లు చేజిక్కించుకుని చక్రం తిప్పాలన్న ప్రయత్నంలో ఉన్నారని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. తాము తిన్నది కాకుండా చైనా కంపెనీకి అక్రమంగా రంగంలో దింపారని, ఇది ప్రభుత్వ రికార్డుల్లో లేకపోవడం విశేషమని ఆయన ఆరోపించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని వారి ఆటలను సాగనివ్వమని ఆయన చెప్పారు. జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కృష్ణపట్నం పోర్టులో నిర్మించనున్న జెన్‌కో సంస్థ పురోగతికి కొందరు అడ్డుపడుతున్నారని, స్వార్థ రాజకీయాలతో ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు కూడా ప్రస్తావించనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం త్వరితగతిన ఏర్పాటు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేతలో ఆలస్యం, నెల్లూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి నిధుల మంజూరు, వెంకటగిరి ప్రాంతం కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌, పౌరసరఫరాల సంస్థ ద్వారా జరుగుతున్న నిత్యావసర వస్తువుల పంపిణీలో లోపాలు, ధరల నియంత్రణ వంటి అనేక సమస్యలు ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే వివేకా వివరించారు.

పొదుపు రుణాల్లో మాయాజాలం


ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: నియోజక వర్గంలోని పలు మండలాల్లో పొదుపు సంఘాలకు మంజూరైన రుణాలను గ్రూప్‌ లీడర్లు స్వాహా చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రూణాల వసూళ్ళకు బ్యాంకు అధికారులు, మండలస్థాయి అధికారులు గ్రామాలలో పర్యటించగా ఈ తనిఖీలలో పలు ఆసక్తికరమైన విషయాలు బట్టబయలు కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గ్రూప్‌ సంఘాల అధ్యక్షులు కొందరు బినామీ స్థానికేతరుల పేర్లతో లక్షలాది రూపాయల రూణాలు పొందినట్లు గుర్తించారు. అంతేకాకుండా గ్రూపు సంఘాల అధ్యక్షులు కొందరు పావలా వడ్డీతో లక్షలాది రూపాయలు బినామీ పేర్లతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈ సొమ్ముతో ప్రైవేట్‌ వ్యక్తులకు నూటికి రూ.10 వంతున వడ్డీ వ్యాపారం చేసుకుంటునారని ఆరోపణలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.ఎక్కువగా ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు తనిఖీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పొదుపు రూణాలలో మాయాజాలంలో వెలుగు సిసిల పాత్ర ఎక్కువగాఉందని గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాయలపై పలు సార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని పోయిన్నప్పటికీ ప్రయోజనం లేదని పలు సంఘబ ంధాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉదయగిరి పట్టణంలో కొందరు మహిళలు గ్రూపు లీడర్‌ కావడంతో ఆశ్రా దగ్గర నుంచి వితంతు, వృద్ధాప్య పింఛనులు సైతం బినామీ పేర్లతో వేలాది రూపాయలు స్వాహా చేస్తున్నవైనం వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గ్రూపులీడర్‌లను మార్చకుండా సంఘమిత్ర బందాలకు ఎన్నికలు నిర్వహించకుండా మండల స్థాయి అధికారులైన సిసిలు కోఆర్డినేట్‌లు గ్రూపులీడర్‌లతో సంఘబంధాల అధ్యక్షులతో కుమ్మకై్క మహిళా గ్రూపులలో ఉండే నిరుపేదలను మోసం చేస్తూ వారికి ఎలాంటి రుణాలు అందజేయకుండా అన్నీ వారై ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారనే విషయాలు బట్టబయలు కావడంతో అటు అధికారులు ఇటు బ్యాంకు సిబ్బందికి ఏమి చేయాలో తెలియక తలపట్టుకొని ఉన్నట్లు తెలుస్తుంది.ఈ అవినీతిలో అందరికీ తలా కొంచం పాత్ర ఉండటంతో అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా గ్రూపు సంఘాల అధ్యక్షులు బినామీ స్థానికేతరుల పేర్లతో లక్షలాది రూపాయలు పొంది బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు విచారించగా ఇందులో రుణాలు పొందిన సభ్యులను చూపించకుండా సంఘాల అధ్యక్షులు గ్రూపు లీడర్లే చెల్లింపునకు కొంత గడువుకావాలని కోరుతున్నారని రుణాలకు సంబంధించి రికార్డులు వాటి వివరాలు లేవని అధికారుల తనిఖీలలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విధంగా ఉదయగిరి నియోజక వర్గంలో పొదుపు రుణాలలో ఎంతమంది పొదుపు గ్రూపు లీడర్లు వారి స్వార్ధానికి వినియోగించుకొన్నది ఇంకా వెలుగులోకి రావాల్సిఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి పొదుపు గ్రూపులలో జరుగుతున్న అవినీతికి కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.

‘భారత జ్యోతి’ అవార్డు పొందిన షబ్బీర్‌

ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: స్థానిక మాజీ మండల అధ్యక్షులు షేక్‌.షబ్బీర్‌ కి ఇంటి గ్రేటెడ్‌ పీస్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌ సొసైటీ కర్నాటక రాష్ట్రం తరపున భారత జ్యోతి జాతీయ అవార్డు వరించింది. ఈనెల తొమ్మిదవ తేదీన ఆయన ఈఅవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఈసంస్థ భారత దేశంలో నిస్వార్థ సేవకులు అవినీతి లేని పాలకులను ఎంపిక చేసి అత్యున్నత పురస్కారం అందించటం ఈలక్ష్యం అయితే మారు మూల ప్రాంతానికి చెందిన షేక్‌.షబ్బీర్‌ ఈఅవార్డుకు వరుసగా ఎంపిక కావటం అత్యంత విషేషంగా మారింది. వరుసగా రెండు సార్లు మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఎంపిక కావటం ఆగ్రో డైరెక్టర్‌, రైల్వే బోర్డు మెంబర్‌ లాంటి ఉన్నత పదవులు అలంకరించినా అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పదవులు నిర్వహించటం, నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తాను ముస్లీం అయినప్పటికీ కళ్యాణ మండపం నిర్మించటం షబ్బీర్‌ మతసామరస్యవాదిగా నిలబెట్టాయి. రాజీవ్‌ గాంధీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు, ఇందిరా ప్రీయదర్శినీ అవార్డులు కూడా షబ్బీర్‌కి రావటం విషేషం.పలువురి హర్షం: షబ్బీర్‌కి అవార్డు రావడంపై మాజీముఖ్య మంత్రి నేదురు మల్లి జనార్థన్‌ రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తమ హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ట కాపాడుతూ ప్రజల హృదయాలు దోచుకున్న షబ్బీర్‌ మరెన్నో జాతీయ అవార్డులు గెలుపోందాలని వారు ఆకాంక్షించారు.

ఆయనకు ఆయనే సాటి

నెల్లూరు (క్రైం), మేజర్‌న్యూస్‌ :పోలీసు సంక్షేమ కార్యక్రమాలను, శాంతి భద్రతలను కాపాడడంలో సౌమ్యుడుగా, ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడంలో ఆయనకు ఆయనే సాటి అని, ఎస్‌పి మల్లారెడ్డి వీడ్కోలు సభలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గుంటూరు రేంజ్‌ ఐజి.కిషోర్‌ కుమార్‌ అన్నారు. సోమవారం నగరంలోని స్వర్ణవేదిక కల్యాణ మండపంలో జరిగిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్‌పి మల్లారెడ్డిని రెండవసారి వీడ్కోలు చేసే కార్యక్రమంలో పాల్గొనడం విశేషమన్నారు. గతంలో కర్నూలు ఎస్‌పిగా పనిచేసినపుడు ఎస్‌పి మల్లారెడ్డి కర్నూలు నుంచి బదిలీ అయినప్పుడు, ప్రస్తుతం నెల్లూరు నుంచి కడపకు బదిలీ అవుతున్న సందర్భంలో జరిగే వీడ్కోలు సభలో పాల్గొన్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ మాట్లాడుతూ ఒకే జిల్లావారమైన తాము ఇద్దరం ఒకే కాలేజిలో చదువుకున్నామని, ఎస్‌పి మల్లారెడ్డి చాలా సౌమ్యుడని తెలిపారు. ఎస్‌పి సమర్థత కారణంగా మూడవసారి మళ్లీ కడప జిల్లాకు ఎస్‌పిగా బదిలీ కావడం గర్వించదగ్గ విషయమన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేసిన మల్లారెడ్డి అనేక బందోబస్తు డ్యూటీలు, ఎన్నికలు జరిపించగలిగారన్నారు. జిల్లా జడ్జి రెడ్డెప్పరె డ్డి మాట్లాడుతూ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ సక్రమంగా ఉంటేనే న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఈ నాలుగు సరిగా ఉంటే అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుత జిల్లా ఎస్‌పి దామోదర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎంతోమంది ప్రేమాభిమానాలను చూరగొన్న ఎస్‌పి మల్లారెడ్డి జిల్లాలోని పోలీస్‌ శాఖకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ విశ్వేశ్వరరావులతోపాటు జిల్లా పోలీస్‌ అధికారులు, ప్రజాసంఘ నాయకులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
నెత్తురోడిన రహదారులుజిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురిని మృత్యువు పొట్టనపెట్టుకుంది. మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం లారీ-మోటార్‌సైకిల్‌ ఢీకొన్న ప్రమాదంలో భార్య శ్రీదేవమ్మ(40) మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామ శివార్లలో సోమవారం ట్రాక్టర్‌ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు రైతులు ఉయ్యాల నారాయణరెడ్డి(58), ఉయ్యాల శ్రీనివాసులరెడ్డి(24)లు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా చిల్లకూరు మండల పరిధిలోని మోమిడి గ్రామంలో సోమవారం లారీ ఢీ కొన్న సంఘటనలో గ్రామానికి చెందిన నెల్లిపూడి చిన వెంకటయ్య(40), ఇంగిలాల వెంకటరమణయ్య(35), షేక్‌ గఫూర్‌ (38)లతోపాటు లారీ డ్రైవర్‌ అక్కడి కక్కడే మృతి చెందారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh