
తడ : మండల పరిధిలోని వేనాడు పంచాయతీ మూల గ్రామంలో ఓ తల్లి మానసిక ఒత్తిడికి లోనై కన్న బిడ్డను గొంతునులిమి చంపిన సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ముతుకు శ్రీనివాసులు షార్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి భారతితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం భారతి సూళ్లూరుపేటలోని డేగావారి కండ్రిగలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషులు రాజీ చేసి నెల క్రితం భారతిని భర్తవద్ద వదలి వెళ్లారు.
ఒకే ఇంట్లో ఉన్నా భార్యాభర్తల మధ్య మాటలు లేవు. తనతో సరిగా మాట్లాడని భర్త కొడుకుతో ఆడుకుంటుండడం చూసి ఓర్వలేక పోయింది. సోమవారం భర్త పనికి వెళ్లిన తరువాత కన్న కొడుకు భరత్(4) గొంతునులిమి చంపేసింది. ఆనోటా ఈ నోటా విషయం బయటకు పొక్కడంతో మంగళవారం పోలీసుల దృష్టికి వచ్చింది. సీఐ హనుమంతరావు, తడ ఎస్‌ఐ బీ. శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. భరత్ మృత దేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను కొడుకును చంపాలనుకోలేదని, గొంతు పట్టుకున్న వరకే తనకు తెలుసని తల్లి భారతి చెబుతోంది.