ఆత్మకూరు: పొట్టకూటి కోసం ప్రాణాంతకమైన పనులు చేయకతప్పడంలేదు. పేదరికం, పనిచేస్తేగాని ఐదువేళ్లు నోటికాడికి చేరని దౌర్భాగ్యం వారిది. జానెడు పొట్ట పోసుకునేందుకు వచ్చి బాణాసంచా బారిన పడి దుర్మరణం పాలయ్యారు ఆ నలుగురు.. ఆత్మకూరుకు ముగ్గురు ఒకేసారి దుర్మరణం పాలవడంతో పట్టణం మూగబోయింది.
పనికి వెళ్లి ఇకతిరిగిరాని లోకానికి వెళ్లడంతో పట్టణవాసులు కంటతడిపెట్టారు. ఆత ్మకూరు సమీపంలోని నాగుల పాడు రోడ్డు వద్ద బుధవారం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీపేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు ఆత్మకూరు పట్టణవాసులుకాగా, మరొకరిది ముత్తుకూరు మండలం సుబ్బారెడ్డిపాళెం. మృతులది పేదరికం నేపథ్యమే.
నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆత్మకూరులోని వీవర్స్‌కాలనీకి చెందిన రాజేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్య, ఏడాది కుమారుడు, తల్లి ఉన్నారు. రాజేష్ మృతితో కుటుంబం దిక్కులేనిదైంది. మరో మృతుడు నసీరుద్దీన్‌కు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. నసీరుద్దీన్ గత కొన్నేళ్లుగా బాణాసంచా తయారీకేంద్రంలో పనిచేస్తున్నాడు. గౌస్‌బాషా అలియాస్‌శివకు భార్య ఉంది.పిల్లలు లేరు. సుబ్రహ్మణ్యం ముత్తుకూరుమండలం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు.
మిన్నంటిన ఆర్తనాదాలు మృతుల వివరాలు తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు మాంసపు ముద్దల్లా తయారయ్యాయి. కడసారి చూపునకు కూడా నోచుకోకపోవడంతో వారివేదన వర్ణనాతీతం. ఉదయం పనికెళ్లొస్తామని చెప్పి వచ్చిన వారు మాంసపుముద్దల్లా తయారైపోవడంతో అయిన వారు దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేశారు. మేం ఎవరికోసం బతకాలంటూ వారు రోధిస్తుండటంతో అందరూ కంటతడిపెట్టారు.
అధికారుల పరిశీలన సంఘటన స్థలాన్ని డీఎస్పీ రాజామహేంద్రనాయక్, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఆంజనేయరెడ్డి, తహసీల్దారు బికె వెంకటేశ్వర్లు, అగ్నిమాపకదళాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు.అదేవిధంగా సంఘటనస్థలాన్ని నెల్లూరు ఆర్డీవో మాధవీలత పరిశీలించారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను పరిశీలించారు. విద్యుత్ తీగలు రాసుకోవడంవల్ల ప్రమాదం జరిగిందా..? మరేమైనా కారణాలు ఉంటాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
జాగ్రత్తలు లేకపోవడమే.. బాణాసంచా కేంద్రంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్‌డీవో మాధవిలత సంఘటనా స్థలికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. కేసు నమోదుచేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయరెడ్డి తెలిపారు.
పరారీలో నిర్వాహకుడు సంఘటన జరిగిన సమయంలో బాణాసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు రఫీ అక్కడే ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను రఫీయే స్వయంగా 108 వాహనంలో ఎక్కించి పరారైనట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా సంభవించిందనే విషయమై పూర్తి సమాచారం అందలేదు. పరారీలో ఉన్న నిర్వాహకుడు రఫీ పట్టుబడితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.