నెల్లూరు జిల్లా: ఈ సారి వేసవి కాలం ముందే వస్తోందని వాతావరణ నిపుణులు ప్రకటించారు. ఎండలు సైతం మునుపెన్నడూ లేని విధంగా మండుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం కాస్త చల్లగా ఉన్నా… మధ్యాహ్నానికి చెమటలు పట్టిస్తాయని, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. చలి… ఈ పేరు చెబితే పాత సామెత గుర్తుకు రావడం సహజమే. సంక్రాంతికి చంకలు లేపనివ్వని చలి, ఉగాదికి ఊడ్చిపెట్టుకుపోతుందనేది ఆ సామెత. శివరాత్రికి శివశివా అంటుందనేది పలు ప్రాంతాల సామెత. ఏదయినా… ఈ ఏడాది శివరాత్రి నుంచే ఎండలు ఆరంభమయ్యాయి. రుతువులు మారకముందే రుతు ధర్మాలు మారుతున్నాయి. ముందే వచ్చిన వేసవి ఈ సారి తన ప్రతాపాన్ని చూపనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాది ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రత సగటున 34.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా…. ఈ సారి ఫిబ్రవరి మాసం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే 34.1 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత వాలెంటీన్ డే నాటికి 37 డిగ్రీల స్థాయికి పెరిగిపోయింది. ఏప్రిల్ రెండో వారానికి ఇది 39 డిగ్రీలను దాటే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ తెలంగాణలలో అధికంగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇక ఈ నెల మూడో వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయంటున్నారు. అయితే అధిక ఎండలు పుష్కల వర్షాలకు సూచనలని, ఈ సారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
No comments:
Post a Comment