నెల్లూరు : నెల్లూరు తాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కాకుండా స్వర్గీయ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను పొగడాలా? అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు. రంగు రంగుల పేపర్లపై ఆంగ్ల సామెతలు, వాటికి తెలుగు అర్థాలు రాసుకొచ్చి ఆ సామెతలను టిడిపికి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అన్వయించారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. అందుకు టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యంగ్యంగా రాహుల్ గాంధీని పొగడలేదేం? అని ప్రశ్నించారు. అందుకు ఆనం రాహుల్‌ని కూడా పొగుడుతా లేకపోతే ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్, బాలకృష్ణను పొగడాలా? అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. పదేళ్లనాటి బడ్జెట్‌కు ఇప్పటి బడ్జెట్‌కు మేరు పర్వతానికి ఆవగింజకు ఉన్నంత తేడా ఉందన్నారు.
అందులో వెతకడానికి ఏమీ లేకే ప్రతిపక్ష నేత ఈ సేవ మీ సేవ అంటూ ఒక్క ఆవగింజను పట్టుకొని పోపెట్టుకుంటున్నారని విమర్శించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యుల వైపు చూస్తూ ప్రజా తిరస్కృతులు.. కళ్లుండి చూడలేని కబోదులు.. తమపై తమకే నమ్మకం లేని నాస్తికులు అంటూ పేపర్ చదవడం మొదలెట్టారు. దీనిపై టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ పొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డికి మైక్ ఇచ్చారు. వివేకానందరెడ్డి మంచి డ్రామా ఆర్టిస్టు చింతామణి నాటకంలో డైలాగులు చెబుతున్నట్లు ఉందన్నారు. ఎక్కడ రాయించుకొచ్చారో? అని ఎద్దేవా చేశారు. దాంతో ఆనం వెంటనే మీకు తెలుగు ట్రస్టు భవన్‌లో రాసిచ్చినట్లు మాకెవ్వరూ రాసివ్వరని సొంతగా రాసుకొచ్చానని చురకలంటించారు. నెపోలియన్ చెప్పిన ఓ ఆంగ్ల సామెతను ఆనం చదవగా దానికి అర్థం తెలుసా? అంటూ టిడిపి సభ్యులు సెటైర్ వేశారు. మీరు ఇట్టా అడుగుతారనే తెలుగులో అర్థం రాసుకొచ్చా అని ఆయన కౌంటర్ వేశారు.
ఒలింపిక్‌లో సెకండ్ వచ్చిన వారికి సిల్వర్ కప్ ఇస్తారట? రాజకీయాల్లో రెండోసారి గెలిచిన వాళ్లు సమస్యలు మరిచిపోతారట? అనగా, ఒలింపిక్‌లో ఇచ్చేది కప్పుకాదు మెడల్ అని టిడిపి సభ్యుడు పల్లె రఘునాథ రెడ్డి, మీరు ఎన్నోసారి గెలిచారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. అదే సమయంలో స్పీకర్ బెల్ మోగించి త్వరగా ముగించండి అనడంతో వాళ్లు డిస్ట్రబ్ చేస్తారని ఊహించే తప్పుపోకుండా పేపర్లో రాసుకొచ్చానని, మీరు బెల్ కొడితే ఎట్టా సరిగా చెప్పలేనని అంటూ ఆనం అక్కడ నవ్వులు పూయించారు. ఇది తెలుగు వారి సభ అని గురజాడ సామెతలు చాలా ఉన్నాయని, వాటిలో ఒక్కటైనా చెప్పలేదేం అని రావుల సెటైర్ వేశారు.
No comments:
Post a Comment