నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరుకు రెండు కిలోమీటర్ల దూరంలో గల నాగులపాడు వద్ద గల బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో నలుగురు కార్మికులు సజీవదహనం కాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల అవయవాలు చెల్లచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. చాలా సేపు మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం చోటు చేసుకుంది.
బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలను అర్పడానికి ఫైరింజన్ చాలా ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది. బాణసంచా కేంద్రంలో ప్రతి రోజు 8 నుంచి 10 మంది పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం కూడా వారు పనిచేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉగాది, శ్రీరామనవమి పండుగల కోసం క్రాకర్లు చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయి. దీంతో జనవరి నుంచి మార్చి నెల చివరి వరకు ఈ కేంద్రంలో బాణసంచా తయారు చేస్తుంటారు.
No comments:
Post a Comment