ఏరా... నీదే పార్టీ... టిడీపీ.. కాంగ్రెస్సా...వైఎస్‌ఆర్ కాంగ్రెస్సా.. ఏ పార్టీ అంటావా..మధ్యాహ్నం చెబుతా... లేదు లేదు.. రాత్రికి చెబుతా.. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో ఏ ఇద్దరు ఒక చోట చేరినా ఇదే రకమైన చర్చ.. ఇదేమిటి అనుకుంటున్నారా... ఉప ఎన్నికల నేపథ్యంలో ఏ కార్యకర్త ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో చెప్పలేని స్థితి... ఆ గ్రామానికి ఏ పార్టీ నాయకొడిస్తే అతనికి జై కొడ్తూ ఎన్నికల తాయిలాలు ఎంచక్కా పుచ్చుకుంటున్నారు... బూర్జువా పార్టీలు డబ్బు, మద్యం ఎర చూపుతుండడంతో చోటా నేతల కప్పదాట్లూ ఎక్కువయ్యాయి..
ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పోటీలోకి దిగిన బూర్జువా పార్టీల అభ్యర్థులు ఓటర్లనూ, చోటా నేతలనూ డబ్బు, మద్యం ద్వారా ప్రలోభ పెట్టేందుకు సిద్ధమయ్యారు. కొందరు అభ్యర్థులు కూలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. టిడిపి తరపున గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సి తీర్థం పుచ్చుకుని ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. వైఎస్‌ఆర్‌సి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలూ, నాయకులూ ఆ పార్టీ పంచన చేరారు. తెలుగుదేశం నుంచి చోటా నేతలు ఆ పార్టీలో చేరారు. ప్రసన్న ముమ్మర ప్రచారంలో ఉన్నారు. టిడిపి తరపున పోటీలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డీ గ్రామ స్థాయిలో విస్తృతంగా తిరుగుతున్నారు. సిపిఎం అభ్యర్థి జొన్నలగడ్డ వెంకమరాజుకు నియోజకవర్గంలో ప్రజా ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ప్రజా సమస్యలపైనే ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఆలస్యంగా ప్రకటించింది. దాంతో ఆయన ఎన్నికల ప్రచారమూ మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న బూర్జువాపార్టీల అభ్యర్థులందరూ ఓటర్లపై ఆధారపడడం లేదు. ఎందుకంటారా వారెవరూ నిత్యం ప్రజలతోఉండి వారి సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదు. అందుకే తాయిలాలను ఎరచూపేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. ఇప్పటికే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన పార్టీలను మారడానికే సమయం సరిపోయిందనీ, సమస్యలెప్పుడు పరిష్కరించారనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక సోమిరెడ్డి అయితే నియోజకవర్గానికి కొత్త అయినా సమస్యలను ప్రస్తావించడం లేదు. ప్రత్యర్థులపై ఆరోపణలనే ఆయుధంగా ప్రచారం చేస్తున్నారు. ఇక పోలంరెడ్డి అయితే ఎప్పుడో పోయిన ఎన్నికల ప్రచారంలో కన్పించారు. మళ్లీ ఇప్పుడు కన్పిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కోవూరు కంచు కోట. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంత బలం లేకపోయినా ప్రజా పక్షాన నిలబడి నిరంతరం సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులనే పేరుంది. సిపిఎం అభ్యర్థి జొన్నల గడ్డ వెంకమరాజుకు మంచి పేరు ఉంది. సుమారు 32 ఏళ్లపాటు ప్రజా ఉద్యమంలో ఉంటూ నీతి నిజాతీకి నిలువుటద్దంగా ఉన్నారు. నియెజకవర్గంలోని ప్రధాన సమస్యల పట్ల ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కోవూరు సుగర్స్ ఫ్యాక్టరీ ప్రయివేటు పరంకాకుండా సిపిఎం ఎంతో కృషి చేసింది. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఇఫ్కోకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి పరిశ్రమలనూ స్థాపించకపోవడంతో తిరిగి వాటిని రైతులకే ఇవ్వాలని పోరాటం చేస్తోంది. పెన్నాపొర్లకట్టలను పటిష్ట పరచాలని ఉద్యమిస్తోంది. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, విడవవలూరు మండలాల్లోని చెరువు లోతట్టు ప్రాంత సాగుదార్లకు హక్కులు కల్పించాలని పోరాడింది. ఇక ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనీ, అర్హులైన పేదలకు ఇళ్లు స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని ఆందోళన చేస్తోంది. ఈ పోరాటాలన్నింటిలోనూ వెంకమరాజు ప్రత్యక్షంగా పాల్గొని కీలక పాత్ర వహించారు. వెంకమరాజు ఈ రోజు జనాల్లోకి తమ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోందనీ, అందుకే తనకుఓట్లేసి గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ధైర్యంగా ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కానీ బూర్జువా పార్టీల అభ్యర్థులకు ఆ పరిస్థితి లేదు. సమస్యలపై ఎనాడూ ఊసెత్తని నాయకులు ఓటర్లను తాయిలాలతో ముంచేందుకు గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. చోటా, ద్వితీయ శ్రేణి నేతలను కొనుగోలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌పార్టీ ఏకంగా అభివృద్ధి పనుల పేరిట నియోజకవర్గంలో ఆరు కోట్ల రూపాయిల నిధులను మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లో చోటా నాయకులకు లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిన కేటాయిస్తూ తమ వైపు తిప్పుకుంటుంది. జిల్లా మంత్రి తన అధికారాన్ని ఉపయోగించి నాయకులను బెదిరించడం, డబ్బు ఆశచూపడం ద్వారా తిరిగి కాంగ్రెస్‌పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అందొచ్చిన అవకాశాన్ని గ్రామస్థాయి నాయకులు ఉపయోగించుకుంటూ తమ గ్రామానికి ఏనాయకుడు వస్తే ఆరోజు ఆపార్టీలో చేరుతూ నిత్యం పత్రిల్లో ప్రత్యక్షమవుతున్నారు. 'నువ్వు ఇప్పుడే పార్టీలో ఉన్నావు.. రేపటి ఏ పార్టీలో చేరుతావ్' అంటూ గ్రామాల్లో జోకులు వేసుకునేస్థాయికి కప్పదాట్లు పోయాయి. పోలింగ్ దగ్గర పడేకొద్దీ నాయకులు ఎన్ని పార్టీలు మారుతారో చూడాల్సి ఉంది.
No comments:
Post a Comment