నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గం నెల్లూరు జిల్లాలో పట్టు సాధించకుండా ముందే ఆనం సోదరులు జాగ్రత్త పడుతున్నట్లుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా వల్ల ఖాళీ అయిన నెల్లూరు లోకసభ స్థానం నుంచి ఆనం వివేకానంద రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి పోటీ చేస్తే మళ్లీ తమకు కాంగ్రెసులో పోటీ తప్పదనే ఉద్దేశంతోనే ఆయన నెల్లూరు స్థానంపై కన్నేసినట్లు చెబుతున్నారు.
నెల్లూరు నుంచి పోటీ చేయాలనుంది, ఆశీర్వదించండి అని ఆయన జయేంద్ర సరస్వతిని కోరారు. నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయానికి జయేంద్ర సరస్వతి ఆదివారం వచ్చారు.
ఆనం వివేకానంద రెడ్డిని జయేంద్ర సరస్వతి చిరునవ్వుతో ఆశీర్వదించి, కుంకుమ ప్రసాదం అందజేశారు. మొత్తానికి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆనం వివేకాయే కాంగ్రెస్ అభ్యర్థి కాబోతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మాగుంట పార్వతమ్మ, నేదురుమల్లి రాజ్యలక్ష్మిల పేర్లు కూడా ఈ స్థానం కోసం కాంగ్రెస్ తరఫున వినిపిస్తున్నాయి. అయితే.. జిల్లా రాజకీయాల్లో మేకపాటి, ఆనం సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మేకపాటిని వివేకాయే ఢీకొంటారని ఉంది. దీంతో మేకపాటి సోదరులను దెబ్బ తీయడానికే కాకుండా నేదురమల్లి వర్గం పుంజుకోకుండా చూడడానికి ఇది సరైన సమయమని ఆనం సోదరులు భావిస్తున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment