online marketing

Friday, June 3, 2011

మున్సిపాలిటి వద్దు - నగరపాలకం ముద్దు

నాయుడుపేట‌: జిల్లాలో మేజర్‌ పంచాయతీగా ఉన్న నాయుడుపేట పంచాయతీని నగరపాలక టౌన్‌ పంచాయతీగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశంలో మున్సిపాలిటిపై చర్చ జరిగింది. మేజర్‌ పంచాయతీలను మున్సిపాలిటిలుగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నందున పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్న దానిపై స్పందించిన పాలక వర్గం మున్సిపాలిటిగా మార్చితే పట్టణంలోని రోడ్ల అక్రమణలతో పాటు సందు గొందులలో ప్రభుత్వ స్థలాలు, రోడ్లు ఆక్రమణల తొలగింపు జరగడమేకాక ఇంటి పన్నుతో పాటు కోళాయి వ్యాపారం పన్నులు అధికంగా పెరగుతాయి.

అంతేకాకుండా మున్సిపాలిటిగా తీర్మాణం చేస్తే పాలక వర్గంపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, ఆలోచనలు ఏర్పడుతాయన్న భావనలు లేకపోలేదు. దానికి తోడు పాలక వర్గం నాయకులకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు దెబ్బతగులుతుందన్న భయం కూడా ఉంది. పట్టణ ప్రజల అభివృద్ధి దృష్ట్యా మున్సిపాలిటి తిర్మాణానికి వెనుకడుగు వేసినట్లు కనబడుతుంది. పంచాయతీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటిలు వచ్చే విధంగా నిధులు విడుదలవ్వాలంటే నగరపాలక టౌన్‌ పంచాయతీగా మార్పు చేయాలని పంచాయతీ తీర్మానించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.

నగరపాలక టౌన్‌ పంచాయతీగా మార్పు చేస్తే మున్సిపాలిటిల వలే పరిపాలన కొనసాగుతుందని ఈవోకు బదులు కమీషనర్‌ అధికారిగా ఉంటారు. పరిపాలన విభాగం మొత్తం మున్సిపాలిటీ వలే జరుగుతుంది. నగర పాలక టౌన్‌ పంచాయతీగా ఉంటే పన్నుల పెంపు అక్రమణల తొలగింపు లాంటి వాటిపై ఒత్తిడి ఉండదు. అదే మున్సిపాలిటి అయితే తప్పనిసరి పై సమస్యలపై ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఈవన్నీ దృష్టిలో ఉంచుకొని రాజకీయ అంశాలను పరిగణంలోకి తీసుకొని ప్రస్తుత పాలక వర్గం నగరపాలక టౌన్‌ పంచాయతీ మార్పుకు మొగ్గు చూపింది. పంచాయతీ పాలక వర్గం తెదేపాకు చెందినది అయినందున కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆ పార్టీ స్థానిక నాయకులు పంచాయతీ తీర్మాణానికి మద్దుతు పలుకుతారో లేక మున్సిపాలిటి మార్పుకు ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

వచ్చే ఎన్నికల్లో జగన్‌దే ప్రభంజనం

కావలి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో మిగిలిన రాజకీయ పార్టీలు కొట్టుకుపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మహానేత వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ఒక్క యువనేత జగన్ వల్లే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, శివకుమార్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, ప్రసాద్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డేవిడ్, పద్మనాబరెడ్డి, రామచంద్రారెడ్డి, తుమ్మలకోటారెడ్డి, సాయి, సర్పంచులు కొండారెడ్డి, జంపాని రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వం

నెల్లూరు : జామియా మసీదుకు చెందిన స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వబోమని మసీదు వక్ఫ్ మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్ ఆసిఫ్‌బాషా పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో శిఖరంవారివీధిలోని జామియా మసీదుకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయన్నారు. అందులో కొంత భాగం అన్యాక్రాంతమైందన్నారు. నగర శివారులో మనుమసిద్దినగర్ లేఅవుట్‌కు ఆనుకొని ఉన్న 117, 118, 119, 120, 121 సర్వే నంబర్లలో 13.33 ఎకరాల భూమి వక్ఫ్‌బోర్డ్ పర్యవేక్షణలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉందన్నారు.

గతంలో ఆర్కాట్ నవాబు జామియా మసీదులో నమాజ్ విధులు నిర్వహించేందుకు ఆ భూమిని కేటాయించారన్నారు. ఆ భూమిలో వచ్చే ఫలితాన్ని ముత్తవల్లి జుబీదాబేగం పూర్వీకులు నమాజ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారన్నారు. వారికి ఆ భూమిని అమ్మేందుకు ఎటువంటి అధికారం లేదన్నారు. 10 సంవత్సరాల క్రితం మసీదుకు చెందిన 3.5 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందన్నారు. కొన్నేళ్లుగా అసాంఘికశక్తులు, మసీద్ భూమిని స్వాహా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షేక్.సంధానిబాషా సయ్యద్, షకీల్ అహ్మద్, సయ్యద్‌ఖాదర్‌బాషా, షేక్, షబ్బీర్, షేక్, మున్నీర్‌బాషా, సయ్యద్ సలార్, తదితరులు పాల్గొన్నారు.

హస్తినకు పయనమైన నేతలు

నెల్లూరు : జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు హుటాహుటిన శుక్రవారం రాష్ట్ర రాజధానికి పయనమయ్యారు. శనివారం ఉభయ సభలు సమావేశం కానున్నాయి. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను ఎన్నుకునేందుకు ఉభయసభలూ ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల నేతలూ వ్యూహ రచనలో తలమునకలయ్యారు. దీంతో జిల్లా నుంచి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారిన నేపథ్యంలో ప్రజాప్రనిధులు వెంట ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజధానికి వెళ్లారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరు జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి వెళ్లగా, సొంత పనుల నిమిత్తం తిరుపతి, బెంగళూరు, చెన్నైలలో ఉన్న మరి కొందరు నేతల కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. పార్టీ సమావేశాల దృష్ట్యా హైదరాబాద్‌కు వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హుటాహుటిన రాష్ట్ర రాజధానికి వెళ్లారు. ఆయన రేణిగుంట నుంచి విమానంలో వెళ్లారు. సరేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి మూడురోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కలిసి రేణిగుంట నుంచి విమానంలో వెళ్లారు. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ‘సింహపురి’ రైలులో వెళ్లారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం గురువారం రాత్రి తిరుపతి నుంచి వోల్వో బస్సులో బయలుదేరి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం చెన్నై నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం గురువారం ఖమ్మం పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఉదయానికే రాజాధానికి చేరుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి శుక్రవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

జగన్ కనె్నర్ర చేయాలి ప్రభుత్వాన్ని పడగొట్టాలి

పొదలకూరు : కనె్నర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని, తన దయాదాక్షణ్యాలపైనే ప్రభుత్వం ఉందంటూ చెప్పుకునే జగన్ అన్న మాటపై నిలబడాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో గత ఏడేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో థర్మల్ ప్రాజెక్టుల కాలుష్యంపై , వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తున్నామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల కార్యకర్తలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మండల టిడిపి అధ్యక్షుడు వెంపులూరు పుల్లయ్యగౌడ్, మండల టిడిపి నాయకులు టి రఘురామిరెడ్డి, సుబ్బరామనాయుడు, షేక్ చాంద్‌బాషా తదితరులు ఈ కార్యిక్రమంలో పాల్గొన్నారు.

మేకపాటికి ఇరకాటం.. ప్రసన్నకు తప్పనున్న గండం అవిశ్వాస తీర్మానంపై జిల్లాలో చర్చోపచర్చలు

నెల్లూరు: అసెంబ్లీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధం కావడంతో జిల్లాలోని వైఎస్సార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి ఇరకాటంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ పార్టీలోకి వెళ్లిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి వెసులుబాటు దొరికింది. జగన్ విసిరిన సవాలుకు సమాధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత అవిశ్వాస తీర్మానానికి సిద్ధమై స్పీకర్‌కు నోటీసు కూడా ఇచ్చారు. దీనితో తీర్మానంపై ఓటింగ్‌పై జిల్లాలో చర్చ మొదలయింది. జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఓటేస్తారనే విషయంలో ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ ఆ పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే ఈ ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం చర్చనీయాంశమయింది. మొదటి నుండి ఆయన జగన్‌కు అనకూలంగానే మాట్లాడుతున్నారు. జగన్ కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పలుసార్లు ప్రకటించారు. కానీ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే ఆయన పదవికి ఎసరు వస్తున్న నేపథ్యంలో ఎలా ప్రశ్నార్ధకంగా మారింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అదే వైఎస్సార్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఆయనకు ఎలాంటి సమస్య వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లే పరిగణలోకి వస్తుంది. దీనితో ఆయన ఇటు వైఎస్సార్ పార్టీకి అటు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగించినట్లవుతుంది

మృతుల కుటుంబాలకు మంత్రి ఆనం పరామర్శ

రాపూరు : ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాశీ యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అశువులు బాసిన రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబీకులను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. గురువారం జోరేపల్లికి వచ్చిన ఆయన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తలుపూరు సరోజనమ్మ కుటుంబీకులను పరామర్శించారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమెతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాపూరు మండల వాసులతో ఉన్న సుదీర్ఘ పరిచయాల నేపధ్యంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వీరి కుటుంబీకులను పరామర్శించారు. మంత్రి వెంట సైదాపురం ఎంపిపి రవికుమార్, రాపూరు ఈద్గా కమిటీ చైర్మన్ షేక్ ముక్తియార్ ఉన్నారు. ఈ పరామర్శ అనంతరం మంత్రి ఆనం మద్దెలమడుగు నాలుగు రోడ్ల కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కొద్దిసేపు చర్చించారు. పర్యటనలో భాగంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందచేశారు. రాపూరు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ పంచాయతీ సిబ్బంది అర్జీ అందచేశారు
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh