నెల్లూరు: అసెంబ్లీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధం కావడంతో జిల్లాలోని వైఎస్సార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి ఇరకాటంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ పార్టీలోకి వెళ్లిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి వెసులుబాటు దొరికింది. జగన్ విసిరిన సవాలుకు సమాధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత అవిశ్వాస తీర్మానానికి సిద్ధమై స్పీకర్‌కు నోటీసు కూడా ఇచ్చారు. దీనితో తీర్మానంపై ఓటింగ్‌పై జిల్లాలో చర్చ మొదలయింది. జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఓటేస్తారనే విషయంలో ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ ఆ పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే ఈ ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం చర్చనీయాంశమయింది. మొదటి నుండి ఆయన జగన్‌కు అనకూలంగానే మాట్లాడుతున్నారు. జగన్ కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పలుసార్లు ప్రకటించారు. కానీ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే ఆయన పదవికి ఎసరు వస్తున్న నేపథ్యంలో ఎలా ప్రశ్నార్ధకంగా మారింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అదే వైఎస్సార్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఆయనకు ఎలాంటి సమస్య వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లే పరిగణలోకి వస్తుంది. దీనితో ఆయన ఇటు వైఎస్సార్ పార్టీకి అటు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగించినట్లవుతుంది
No comments:
Post a Comment