నెల్లూరు : నెల్లూరు నగరాన్ని ఏళ్ల తరబడి శాసిస్తూ రాజకీయంగా గట్టి పట్టుతో ఆ నలుగురు అన్నదమ్ముళ్లు ఒకే మాటగా... ఒకే బాటగా...ఉంటూ ఆనం మార్కును నగరం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉనికిని చాటుకునే ఈ తరుణంలో ఆనం జయకుమార్‌రెడ్డి అన్నదమ్ముల నుంచి రాజకీయంగా తిరుగుబాటు చేయడంతో ఆయన్నే నమ్ముకున్న మరి కొంతమంది కార్పొరేటర్లు జయ్యన్నకు జై....జగన్ అన్నకు జై...అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆనం వివేకాకు ఇటీవల కాలంలో ఆయన చెప్పిందే వేదంగా గాలులు ఆయనకు అనుకూలంగా వీస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రిగా రామనారాయణరెడ్డి రాష్ట్ర స్థాయిలో చక్రాన్ని తిప్పుతున్నప్పటికీ సొంత ఇంట్లోనే బీటలు వారడంతో జిల్లాలోని రాజకీయ నాయకులు గుసగుసలు మొదలుపెట్టారు. ఇప్పటికే వివేకాకు, జయకుమార్‌కు మధ్య దూరం ఎక్కువైంది. మర్యాదపూర్వకంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఆనం జయకుమార్‌రెడ్డి ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కలవడం కాస్తా చర్చనీయాంశంగా మారింది. వివేకాకు జయకుమార్ దూరదూరంగా ఉండడంతో వివేకా మీద అసంతృప్తి వున్న కొంతమంది కార్పొరేటర్లు రహస్యంగా జయకుమార్ గూటికి చేరి రహస్య మంతనాలు చేయడమే గాక మరికొంతమందిని కూడా ఈ గూటిలో చేర్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నట్లు సమాచారం. కోవూరు ఉప ఎన్నికలో ప్రచారానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడుని పిలవకపోవడంతో ఆయన కూడా వివేకాపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జయ గూటికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా చేరవచ్చునని సమాచారం. ఒక వైపు ఉప ఎన్నికలు, మరోవైపు ఎంపి ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఆనం కుటుంబంలోని చీలిక రాజకీయంగా పలు విమర్శలకు తావిస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న చందంగా అన్నదమ్ములందరూ ఒకటవుతారా లేక వేర్వేరు కుంపట్లు పెట్టుకుని చర్చలకు తావిస్తారా అనేది వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment