జగన్ వస్తున్నారు.. ఆయనను పలకరిద్దాం, దండలు వేద్దామని వెళ్లిన పాపానికి ఆ మత్స్యకారులకు దెబ్బలు తగిలాయి. అవికూడా అలాంటి, ఇలాంటి దెబ్బలు కావు.. పోలీసు దెబ్బలు! నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఇందుకూరుపేట మండలం మైపాడులో మత్స్యకారులను దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని కుమ్మేశారు. పిడికిళ్లు బిగించి పొట్టలో కొట్టారు. మత్స్యకారులు కూడా వారితో తలపడేందుకు ప్రయత్నించినా.. వారి పశుబలం ముందు నిలవలేకపోయారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలగజేసుకోవడంతో పరిస్థితి చల్లబడింది.
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రోడ్‌షో మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట, కొత్తూరు, ఇందుకూరుపేటలలో రోడ్‌షో ముగించుకుని వస్తున్న జగన్ కాన్వాయ్‌ను జంగంవారిదొరువు గ్రామస్థులు అడ్డుకుని, తమ గ్రామంలోకి కూడా రావాలని పట్టుబట్టారు. సమయాభావం వల్ల రాలేకపోతున్నానని వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. సోమరాజుపల్లి, కొరుటూరు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మైపాడుకు జగన్ చేరుకున్నారు.
మైపాడు తుపాను షెల్టర్ సమీపానికి ఆయన చేరుకునేసరికి సుమారు పదిమంది మత్స్యకారులు అక్కడకు వెళ్లి, ప్రచార రథం నుంచి కిందకు దిగాలని జగన్‌ను కోరారు. వారిలో కొందరు జగన్‌కు పూలదండలు వేసేందుకు పోటీపడ్డారు. అంతే.. జగన్ సెక్యూరిటీ సిబ్బంది వారిని ఓ పక్కకు తోసేశారు. వాళ్లకు, స్థానిక మత్స్యకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఇంతలో జగన్ వాహనం కొంత ముందుకు వెళ్లింది. దాంతో మత్స్యకారులు మరోసారి జగన్‌ను కలిసేందుకు వెళ్లబోయారు. సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను మళ్లీ నెట్టారు.
దాంతో వారి మధ్య మాటా మాటా పెరిగాయి. జగన్‌ను చూద్దామని వస్తే.. ఆయనకు దండ వేద్దామనుకుంటే తమను అడ్డుకుంటారేమిటంటూ స్థానికులు నిలదీశారు. వారిని జగన్ చుట్టూ ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ఏడెనిమిది మంది వచ్చి స్థానికులను చితక్కొట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాదారు. పిడికిళ్లు బిగించి పొట్టలో కొట్టి.. పోలీసు మార్కు దెబ్బలు రుచి చూపించారు.
ఓ సెక్యూరిటీ గార్డు ఎగిరి కాలితో తన్నబోగా.. స్థానికులు ఆ కాలు పట్టుకుని లాగారు. అతడు కింద పడటంతో గార్డులు మరింత రెచ్చిపోయారు. దాదాపు పది నిమిషాల పాటు ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. తర్వాత పార్టీ నేతలు కొంతమంది వచ్చి, సెక్యూరిటీ సిబ్బందిని వారించి.. వాళ్లను ప్రచార రథంలోకి ఎక్కించారు. "అభిమానంతో జగన్‌తో నేరుగా మాట్లాడాలని వస్తే మాపై దాడులు చేస్తారా?'' అని మత్స్యకారులు మండిపడ్డారు.
No comments:
Post a Comment