నెల్లూరు:,"గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం కోసం పోరాడాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. వారి విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తే పిల్లలకు జేబులు కొట్టే అలవాటు వస్తుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దొంగ అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఓ గజదొంగ అని దుయ్యబట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల మలివిడత ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఇందుకూరుపేట మండలంలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో, అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. "1993 నుంచి 2009 వరకు పార్టీ టికెట్ ఇవ్వడమే కాదు. పైసలు కూడా ఖర్చు చేసి ప్రసన్నను గెలిపించాం. కానీ, రెండు నెలలు తిరగకముందే ఆయన 'వైఎస్ఆర్ ఆకర్ష్'లో చిక్కాడు. డబ్బు సంచులు తెచ్చుకుని దొంగగా మారాడు. ఆ దొంగను అభ్యర్థిగా పెట్టడం ద్వారా జగన్ మరో గజదొంగ అయ్యాడు. సీబీఐ అరెస్ట్ చేస్తుందని భయపడి ఇంట్లోనే దాక్కొన్న జగన్ దొంగ లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు. నేను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పిన తర్వాతే ఆయన ప్రజలను ఓట్లు అడగాలి'' అని బాబు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ దొంగల పార్టీ అని, ఆ చెట్టు నుంచి పుట్టిన విషపు కొమ్మ జగన్ అని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వస్తే పాలన పిచ్చోడి చేతిలో రాయి అవుతుందన్నారు. వైఎస్ చేసినంత అన్యాయం, అవినీతి ఏ సీఎం చేయలేదన్నారు. రెండేళ్లుగా ఓదార్పు చేస్తున్న జగన్ ఓ దోషి అని, ఆయన్ని ఓదార్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. పాపిష్టి సొమ్ముతో పెట్టిన జగన్ పత్రిక చదవొద్దని, చానల్‌ను చూడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ ఒక్క పత్రిక కూడా పెట్టలేదన్నారు.
టీడీపీ ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న తమకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని చెప్పారు. చిరంజీవి సినిమా డబ్బా తిరుగుటపా అయిందని, కానీ, ఎన్టీఆర్ మడమ తిప్పని నేత అని కొనియాడారు. యూపీ ఫలితమే 2014లో ఆంధ్రప్రదేశ్‌లోనూ పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు
No comments:
Post a Comment