Friday, February 19, 2010
దంపతుల బలవన్మరణం
విడవలూరు, (మేజర్ న్యూస్) : డెంగీ జ్వరంతో కుమార్తె మరణించిందని మనస్థాపం చెందిన దంపతులు విషపు గుళికలు తిని బలవన్మరణనానికి పాల్పడిన సంఘటన గురువారం విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో జరిగింది. టెక్కం సుధాకర్ (49), దేవసేన (44)లు చనిపోయి వుండగా స్థానికులు కనుగొన్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. సుధాకర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా అందులో ఒకరైన సురేఖను విడవలూరులోని తుపాకుల మధుసూధనరావుకు ఇచ్చి వివాహం చేశారు. ఆమె సంవత్సరం క్రితం ఆరోగ్యం బాగాలేక మృతిచెందింది. ఈ నేపథ్యంలో రెండవ కుమార్తె ఎర్రంశెట్టి సుమలత (28)ను పార్లపల్లిలోని మల్లికార్జునకు ఇచ్చి వివాహం చేశారు. ఈమె కూడా డెంగీ జ్వరం రావడంతో 16 రోజుల క్రితం చికిత్స నిమిత్తం చెనై్నలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం సాయంత్రం మృతిచెందింది. కూతురు పరిస్థితి విషమంగా వున్నప్పుడు చెనై్న నుండి ఆమె తల్లిదండ్రులైన సుధాకర్, దేవసేనమ్మలు స్వగ్రామమైన ఊటుకూరుకు వచ్చారు. గతంలో ఒక కూతురు మృతి చెందగా, రెండవ కుమార్తె కూడా మర ణించడంతో తీవ్రమనస్థాపానికి గురై విషపుగుళికలు నీళ్ళలో కలిపి త్రాగారు. కుమార్తె అంత్యక్రియల కోసం తల్లిదండ్రుల కోసం పార్లపల్లి నుండి ఊటుకూరు గ్రామానికి వెళ్ళిన వారు ఆ ఇద్దరు చనిపోయి వుండడం చూసి వారిని కలిచివేసింది. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నుంచి పల్లెపాళెం వెళ్ళేదారిలో ఇంటి మీద్దపై దేవసేన, క్రింద ఇంటిలో సుధాకర్‌లు మరణించి వుండగా కనుగొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని జరిగిన సంఘటన చూసి కలత చెందారు. కోవూరు సిఐ విఎస్ రాంబాబు, విడవలూరు ఎస్‌ఐ టిసి వెంకటయ్యలు అక్కడికి చేరుకొని శవపంచనామా చేశారు. జరిగిన సంఘటన గురించి చుట్టుప్రక్కల వారిని, మృతుల బంధువులను విచారణ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం దంపతుల మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment