online marketing

Sunday, August 28, 2011

కౌలన్నకు కష్టాలు తీరేనా?

నెల్లూరు :కౌలుదారులకు రుణాలు అందించి వారి క్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అని నెల్లూరు కౌలుదారుల రుణాల పంపిణీ కార్యక్రమ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామంటూ ఓ వైపు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అవి మాత్రం అసలైన కౌలుదారులకు అందడంలేదు. భూస్వాముల నుంచి పొలాలను కౌలుకు తీసుకుని పండించే రైతన్నకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కౌలుదారుల రుణాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగానే జిల్లాలో 4,127 మంది కౌలుదారులను ఆయా మండలాల రెవెన్యూ తహసిల్దార్‌లు, గ్రామ విఆర్‌ఒలు గుర్తించడం జరిగింది. వీరికోసం రూ.10.08 కోట్లును రుణాలు పంపిణీ చేసేందుకు లక్ష్యంగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. కాని ప్రస్తుతం జిల్లాలో 500లకు మించి కూడా రైతులకు రుణాలు అందలేదు. దీనికి అసలు కారణం భూయజమాని కౌలు రైతులకు ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టకపోవడం ఒక కారణమైతే బ్యాంకులు కౌలు రైతులకు హామీలు ఉండేందుకు రైతులు లేరంటూ కుంటిసాకులు చెప్పి రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం జిల్లాలో నీరుగారిపోతోంది.

ఈ పథకాన్ని పటిష్టంగా పూర్తి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం కౌలుదారులకు కార్డులు పంపిణీ చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంది. హంగులూ, ఆర్భాటాల కోసం ముఖ్యమంత్రి చేతులమీదుగా జిల్లాలో కౌలుదారుల రుణాల పంపిణీ పత్రాలను కూడా అందజేసింది. బ్యాంకులు మాత్రం నిబంధనల పేరుతో కౌలు రైతులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. అసలే కౌలు చెల్లించలేక నష్టాలపై వ్యవసాయం చేస్తున్న ఈ రైతులకు ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఏమాత్రం ఉపయోగ పడడంలేదు.

ఇందులో బ్యాంకుల పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ప్రదానంగా కినిపిస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధిగా ఆయా బ్యాంకులకు విధి విధానాలు పంపకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రైతులను కంటితుడుపు తుడిచేందుకు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి ఉపయోగం లేకుండా చేస్తున్నాయి. ‘ఫలహారం ఇచ్చాం... తన్నుకు చావండి’ అన్న చందాన తయారైంది ఈ కౌలుదారీ రుణాల పంపిణీ కార్యక్రమం. జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న రుణాలను పంపిణీ చేయలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతన్నలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీలకు తెచ్చుకుని రుణాలను తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నారు.

అసలే ఖర్చులతో తడిసిమోపెడవుతున్న వ్యవసాయానికి ప్రైవేటు వడ్డీభారం మరింత తోడవుతోంది. దీనికితోడు పోటీ తత్వంతో భూయజమానులు కౌలు రేట్లు కూడా పెంచేశారు. దీంతో కౌలు రైతులు కుటుంబం గడవక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వ్యవసాయాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమన్న కాంగ్రెస్‌ నాయకులు కౌలు రైతులను మన జిల్లాలో కష్టాల నుంచి కాపాడాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే కౌలుదారీ రుణపత్రాలు పొందిన 4,127 మంది రైతులకు వెంటనే బ్యాంకుల నుంచి రుణాలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఓ వైపు ప్రతిపక్షాలు ప్రకటనలు జారీ చేస్తున్నా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి యంత్రాంగం దృష్టి సారించి కౌలు రైతులందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు విఙ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh