online marketing

Sunday, November 6, 2011

వర్షంతో కష్టాలు

నెల్లూరు :జిల్లాలో గత 12 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవితం కష్టాల కడలిగా మారింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. పనులు లేక కూలీలు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై నీటిలోనే పేద, బడుగు వర్గాలు కాపురం చేస్తున్నాయి. పొగాకు, మినుము రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేజర్ల మండలంలో రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో అక్కడి రైతులు వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

చిత్త కార్తె అయినప్పటికీ అక్టోబర్‌ 23 అర్థరాత్రి వరకు ఎండలు మండిపోతూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. 23 అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. అతివృష్టి, అనావృష్టి ఏది వచ్చినా పేద ప్రజలు బలవుతున్నారు. 12 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా ప్రజలు అతలాకుతలం అయ్యారు. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు తీరని అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

స్థానిక చంద్రబాబు నగర్‌లో మంచినీటి కుళాయిల్లో మురుగునీరు రావడంతో నీటి కొరత ఏర్పడి ప్రజలు మంచినీటికి అవస్థలు పడుతున్నారు. వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. 15 రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే వంద శాతం వరకు ధరలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితులు కరువయ్యాయి. కలువాయి, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, వరికుంటపాడు, వింజమూరు, ఎఎస్‌.పేట, కలిగిరి, ఉదయగిరి, దుత్తలూరు, రాపూరు, పొదలకూరు, చేజర్ల, డక్కిలి తదితర మండలాల్లో మినుము, పొగాకు రైతులు పంటలు నీట మునిగి భారీ స్థాయిలో నష్టపోయారు. చేజర్ల మండలంలో రోడ్లపైకి నీరు వచ్చి ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.

రోడ్లు గుంతల మయం కావడంతో అక్కడి రైతులు రోడ్లపై వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. చేనేత కార్మికులు వర్షాలవల్ల పనులు జరగక పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో పేదల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. తుపానుకాకపోవడంతో ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదని, అంతకన్నా అధికంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh