online marketing

Friday, November 25, 2011

శివారు ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు

నెల్లూరు, :నెల్లూరు నగరానికి ఆనుకునివున్న శివారు ప్రాంతాల్లో రాత్రి 7 గంటలు దాటితే ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోయాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్థానికులు ఎన్నిసార్లు తమప్రాంతానికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తేకాని తాము రామని భీష్మించుకు కూర్చోవడంతో ఈ ఆకతాయిలపై పోలీస్‌ స్టేషన్‌లలో స్థానికులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. ఫలానా వ్యక్తులు తమ ప్రాంతాల్లో గలభా చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తిరిగి స్థానిక నాయకుల సహకారంతో స్టేషన్‌ బయటకు వచ్చి తిరిగి తమపై అసభ్యకరమైన పదజాలాలతో ఘర్షణలకు దిగుతారని వాపోతున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారా బాధితులు పోలీస్‌ స్టేషన్‌లకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బాధితుల వైపు నుండి వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రెండవ పట్టణ పరిధిలోకి వచ్చే కిసాన్‌నగర్‌, సింహపురి కాలనీ, రాజీవ్‌ గాంధీ కాలనీ, జాకీర్‌హుస్సేన్‌ నగర్‌, గాంధీ గిరిజన కాలనీ, తదితర ప్రాంతాల్లో సాయంత్రం 7 గంటల నుండే మద్యం సేవించి రోడ్లకు ఇరువైపులా నిలబడి ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే పాదచారులను అసభ్యకర మైన పదజాలంతో తిడుతూవుంటారు. మహిళలైతే ఈ తిట్ల పురాణం భరించలేక తలలు దించుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానిస్తున్నారు. సమీపంలోని సాయిబాబాగుడి, సీతారామాంజనేయస్వామి గుడి దేవాలయాలు ఉండడంతో సాయంత్రం వేళల్లో స్థానిక మహిళలు ఎక్కువగా ఈ వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మద్యం బాబులతో తమకు తలనొప్పిగా తయారైందంటున్నారు.

రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో 2వ పట్టణ పోలీసులు గస్తీకి సక్రమంగా రాకపోవడంతో వీరు మరింత పెట్రేగిపోతున్నారనేది సమాచారం. ఒకవేళ 2 టౌన్‌ పోలీసులు వచ్చినా 10.30- 11.00 గంటల సమయంలో జీపులో సైరన్‌ వేసుకుంటూ వేగంగా వెళ్లడం, తిరిగి అదేవేగంతో స్టేషన్‌కు చేరుకోవడంతో ముందుగానే సైరన్‌ శబ్ధం వింటున్న మద్యం బాబులు, అల్లర్లకు పాల్పడేవారు సమీపంలోని చీకటి ప్రాంతాల్లో దాక్కోవడం, జీపు వెళ్లగానే తిరిగి రోడ్లపైకి చేరుకోవడం, బహిరంగంగానే రోడ్లపైకి వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మైపాడుగేటు, కిసాన్‌నగర్‌, ప్రశాంతినగర్‌ సెంటర్ల వద్ద ఎక్కువగా నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ విషయాలు స్థానిక పోలీసులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతాలన్నీ సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు రికార్డులలో నమోదైవున్నాయి.

స్టేషన్‌కు కొత్త ఎస్‌ఐ వచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. అదేవిధంగా కొత్త బైపాస్‌ రోడ్డుమీద కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది. లీలామహల్‌ సెంటర్‌కు కూతవేటు దూరంలో సిఐ కార్యాలయం, 4వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నా ఈ ప్రాంతంలో జడ్పీ సెంటర్‌లోనూ, అలంకార్‌ సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. అలాగే రామలింగాపురం, హరనాధపురం ప్రాంతాలతోపాటు పొదలకూరురోడ్డులోని డైకస్‌రోడ్డు, పద్మావతి సెంటర్‌, సారాయి సెంటర్‌ ప్రాంతాల్లో రాత్రి 7 గంటలు దాటిందంటే ముఖ్యంగా మహిళలు రాకపోకలు సాగించాలంటే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా ఇంట్లో ఎవరో ఒకరిని తోడు తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అలాగే నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద కూడా సాయంత్రం సమయంలో వీరి గొడవ ఎక్కువగా ఉందని ఆయా ప్రాంత ప్రజలు చెబుతున్నారు. పోలీసులు ఈ తరహా సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించి అరికట్టాలని, లేనిపక్షంలో అసాంఘీక కార్యకలాపాలు శివారు ప్రాంతాల్లో ఎక్కువైపోయే ప్రమాదం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌నిఘాను ఎక్కువగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు. గత రాత్రి కూడా నగరంలోని మినీ బైపాస్‌రోడ్డు ప్రాంతంలో ఒక పార్టీ కార్యాలయం సమీపంలోనే మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా నగర శివారు ప్రాంతాల్లో వున్న సమస్యాత్మక ప్రాంతాల వైపు పోలీసులు తమ దృష్టిని సారించాలని నగర ప్రజలు, ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh