నెల్లూరు : యువతకు దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలపై అవగాహన ఉండాలని, ఈ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో యువకులు ప్రధాన పాత్ర పోషించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక రామకోటయ్య భవన్‌లో ఆదివారం కోస్తాంధ్ర యువజన సమాఖ్య కార్యకర్తల విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను నారాయణ ప్రారంభించారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఈ అవినీతి కుళ్ళి కంపుకొడుతున్న దశలో 75 సంవత్సరాల అన్నాహజారే దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నారాయణ అన్నారు. దేశ భద్రత విషయంలో వీర జవానులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో కూడా పాలకులు అవినీతికి పాల్పడ్డారని, ప్రతిదీ అవినీతిమయమైన ప్రస్తుత తరుణంలో యువకులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు, ప్రకృతి సంపద మన దేశంలో ఉన్నాయని, సారవంతమైన పొలాలు, నిష్ణాతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్‌లు, మేధావులు ఉన్నప్పటికీ దేశం అవినీతితో అనుకున్న ప్రగతి సాధించలేకపోతున్నదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్‌బ్యాంకులో మన దేశ సంపద అంతా దాచివుందని, ఈ డబ్బును బయటకు తీస్తే దేశంలో ప్రతి గ్రామాభివృద్ధికి రూ. 600 కోట్లు నిధులు కేటాయించవచ్చునని అన్నారు. అన్నాహజారేకి ముందే అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు దేశంలోనూ, పార్లమెంటులోనూ పోరాటం చేశాయని, అనేక అక్రమాలు బయటపెట్టాయని, అయితే ప్రచార సాధనాలు వాటికంత ప్రాధాన్యత ఇవ్వనందున అవి ప్రజలలోకి వెళ్ళలేదని నారాయణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ దివాళాకోరుతనం వల్లనే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయని, కాంగ్రెస్‌పార్టీ నేతలు తెలంగాణాలో ఒక మాట, కోస్తాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నా, పార్టీ హై కమాండ్ ఈ నేతల మాటలను సమర్ధిస్తున్నదని ఇందువల్లే తెలంగాణా సమస్యగా మారిందన్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ఇందుకు వ్యతిరేకంగా యువకులు పోరాటం సాగించాలని నారాయణ పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment