నెల్లూరు : ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేస్తే ఎవరు అవినీతిపరులో తెలుస్తుందని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారన్న బొత్స వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఎవరు నిజాయితీపరులో తెలియాలంటే బొత్స రాజీనామా చేసి ప్రజాకోర్టుకు రావాలన్నారు. రాజీనామాలు చేసిన వారు ఎవరూ వెనక్కి వెళ్లరన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే ముందు రాజీనామాలు ఆమోదించాలని సవాల్ విసిరారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ మీద గెలిచిన మంత్రులు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తుంది బొత్సనే అన్నారు. తాము ఎవరి ప్రలోభాలకు లొంగేది లేదన్నారు. అవినీతిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోరాటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తమకు పదవి ముఖ్యం కాదని వైయస్సార్, జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమమన్నారు. కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళీ వ్యాఖ్యలపై జగన్ వర్గం నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళీ త్వరలో తమ పార్టీలోకి వస్తారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి సైతం కొండ్రు వ్యాఖ్యలను ఖండించారు. జగన్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు కట్టుబడి ఉన్నారన్నారు. రాజీనామాల కోసం ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. అందరూ సొంతగానే రాజీనామాలు చేశారన్నారు. ఎమ్మెల్యేల రాజీనామా విషయం జగన్‌కు సైతం తెలియదన్నారు. ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించడానికే కొండ్రు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు
No comments:
Post a Comment