ఉదయగిరి : వరప్రసాదిని యైన సోమశిల జలాశయంనుంచి హైలెవల్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించి నట్లు తెలిసింది. సోమశిల ప్రాజెక్టు సాధారణ నీటి ప్రవాహంమించి అదనంగా సముద్రంలోకి వెళ్ళే నీటిని ఉత్తర కాలువ ద్వారా ఉదయగిరి -ఆత్మకూరు నియోజకవర్గాల్లోని సుమారు 6మండలాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి ప్రాంతనేతలతో కలిసి ఆదివారం ముఖ్యమంత్రిని తన ఛాంబర్‌లో కలుసుకుని అందుకు ఆమోదం తెలపాలని కోరినట్లు తెలిసింది.
మంత్రి ప్రతిపాదనకు స్పందించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు హైలెవల్ కాలువ నిర్మాణానికి నిధులు విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే టెక్నికల్ పిటిషన్ తదితర అంశాలతో ప్రతిపాదనలు సిద్దంచేస్తే ఆమోదిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.సోమశిల ప్రాజెక్టు హైలెవల్ కాలువ నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు పరిథిలోని ఆత్మకూరు నియోజకవర్గం లోని మర్రిపాడు, అనంతసాగరం మండలాలకు కొంతభాగం, ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు, వింజమూరు, కలిగిరి కొండాపురం మండలాల్లో సుమారు 1లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వెలుగొండ ప్రాజెక్టు పరిథిలోని సీతారామసాగర్ ప్రాజెక్టునుంచి నియోజక వర్గంలోని ఉదయగిరి , వరికుంటపాడు, మండలాలతో పాటు దుత్తలూరు మండలంలోని కొంతభాగానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కాలువల నిర్మాణంకూడా చేపట్టింది. ఇప్పటికే దాదాపు 50శాతంపైగా కాలువ తవ్వకాలు జరుగుతున్నాయి.ఇటు సీతారామసాగర్ అటు సోమశిల హైలెవల్ కాలువల ద్వారా సాగునీరు అందిస్తే నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మినహాయిస్తే , మిగిలిన 7మండలాలకు సాగునీరు అభ్యమయ్యేఅవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏలాంటి సాగునీరు అవకాశాలు లేని మెట్టప్రాంత రైతులకు ఈ ప్రతిపాదన ఒకరకంగా ఊరటనివ్వడమే కాకుండా మెట్టబెట్టతీరినట్లు అవుతుంది.
No comments:
Post a Comment