నెల్లూరు: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తూ తమ తమ వర్గనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటి వరకూ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్లసిరి గోపాల్‌రెడ్డి జగన్ వర్గానికి మద్దతు తెలిపడంతో ఆయనను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. దీంతో అప్పటి నుంచి డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. తాజాగా జిల్లాలో పార్టీ బాధ్యతలను కొత్త అధ్యక్షుడిగా ఎంపిక జరిగేవరకూ జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికే అధిష్ఠానం అప్పజెప్పడం జరిగింది. అయితే ఆయన కూడా త్వరలోనే డీసీసీ అధ్యక్ష ఎంపిక పూర్తిచేయాలని అధిష్ఠానాన్ని కోరడం ద్వారా ఆర్థిక మంత్రిగా తనకు వెసులుబాటు ఉండకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే డీసీసీ అధ్యక్ష స్థానానికి అభ్యర్థి ఎంపిక పూర్తిచేయనున్నట్లు తెలిసింది.
ఈ పదవి కోసం పోటీలో పలువురు నేతలున్నారు. వీరిలో ముందు వరసలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. నేదురుమల్లి సన్నిహితుడిగా పేరున్న ఈయనకు పదవి ఇప్పించేందుకు పెద్దాయన ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. తాజా మంత్రివర్గంలో తన వారికి అవకాశం ఇప్పించడంలో విఫలమైన నేదురుమల్లి ఎలాగైనా డీసీసీ పీఠం తన వర్గానికే దక్కాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈయన మద్దతుదారుడుగా ఉంటూనే ఆనం వర్గంతో విబేధాలు లేని డీసీసీబి అధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి పేరు కూడా ఈ రేసులో ప్రముఖంగా వినవస్తోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థికే టికెట్ తీసుకొచ్చుకోవడంలో సఫలమైన వాకాటికి నేదురుమల్లి అడ్డుచెప్పక పోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. వీరిద్దరిలో ఎవరికిచ్చినా ఆదాల, కాకాణిలు పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఆనం వర్గం తరపున ఈ పదవి కోసం ప్రస్తుతం పార్టీ నగర అధ్యక్షుడు చాట్ల నరసింహరావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి వెంట జిల్లాలో పర్యటిస్తూ తనను అన్ని ప్రాంతాల నేతలకు పరిచయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబోయే డీసీసీ ప్రెసిడెంట్‌గా చాట్ల పేరు నగరంలో మార్మోగుతోంది. అయితే ఇతని ఎంపికను జిల్లాలో ఆదాల, నేదురుమల్లి వర్గాలు తీవ్రంగా అడ్డుకునే అవకాశాలు ఉండడంతో ఇతని ఎంపిక మీద సందేహాలు కూడా నెలకొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత చేవూరు దేవకుమార్‌రెడ్డి కూడా డీసీసీ రేసులో దూసుకుపోతున్నారు. పనబాక వర్గం కింద ఈయన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒకవేళ అధిష్ఠానం ఈయన్ను ఎంపిక చేయాలని భావిస్తే ఆనం వర్గం అడ్డుచెప్పకపోవచ్చు. ప్రస్తుతానికి డీసీసీ అధ్యక్ష రేసులో ప్రధానంగా పోటీ ఈ నలుగురి నడుమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధిష్ఠానం కూడా సస్పెన్స్‌కు తెరదించి త్వరలో సమర్థుడికి డీసీసీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా ఇటు ప్రతిపక్షాలను, అటు త్వరలో ఏర్పాటు కాబోయే జగన్ పార్టీని ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉంది.
No comments:
Post a Comment