నెల్లూరు:రోజుకొక తరహాలో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల నుంచి యువతులను ఆకర్షించి నెల్లూరు నుండి విదేశాలకు వ్యభిచారం నిమిత్తం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అందిన వివరాల్లోకెళ్తే సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఆంధ్ర అమ్మాయిలకు విపరీతమైన గిరాకీ పెరగడంతో రాష్ట్రంలోనే నెల్లూరులోని ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న యువతులను కొందరు బ్రోకర్లు అట్టే రాబట్టేస్తున్నారు. కోవూరు, బుచ్చి, నెల్లూరు, గూడూరు, కావలి వంటి ప్రధానమైన ప్రాంతాల్లో ఇళ్లను బాడుగకు తీసుకుని కొంతమంది ఆడ, మగ బ్రోకర్లు మకాం వేస్తున్నారు. వీరు ప్రతి రోజూ రద్దీగా ఉండే బస్టాండ్‌లు, షాపింగ్ కాంప్లెక్స్, కాలేజీల వద్దకు చేరి మహిళలను మాయమాటలు చెప్పి వారికి ముందుగా ఆకర్షణీయమైన మాటలు చెప్పి లోబరుచుకుంటున్నారు.
తర్వాత అమ్మాయిల ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని వారికి పాస్‌పోర్ట్ తయారుచేయించి విదేశాలలో ఉద్యోగమిప్పిస్తామని మాయమాటలతో న మ్మపలికి విదేశాలకి పంపిస్తున్నారు. అయితే వారికి ఏర్పాటు చేసే వీసా కేవలం తాత్కాలికంగా ఇచ్చిన సంగతి వారికి చెప్పకుండానే పంపించడమేగాక, ఇచ్చే పాస్‌పోర్ట్ నకిలీది ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాస్‌పోర్ట్‌తో ఏదోవిధంగా మద్రాస్‌లోని కొంతమంది బ్రోకర్లు విమానమెక్కించి విదేశాలకు తరలిస్తున్నారు. అయితే అక్కడకు పోయిన తర్వాత అసలు ఉద్యోగం వ్యభిచారం అన్న సంగతి వారికి తెలియదు. ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో నెలల పర్యంతం అక్కడే వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారు. మరికొంతమందిని ఇక్కడే వ్యభిచార వృత్తిలో బాగా సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి ఈ బ్రోకర్లు అక్కడకు పంపుతున్నట్లు తెలిసింది.
జిల్లాలో నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారుచేసేవారు కూడా ఉన్నారని సమాచారం. ఇటీవల కొంతమంది జిల్లా వాసులు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్‌కు వెళ్లొచ్చినవారు జిల్లాకు చెందిన మహిళలు అక్కడ వ్యభిచార వృత్తిలో మగ్గుతున్నారని, వారి బాధలు వర్ణనాతీతమని తెలిపినట్లు తెలిసింది. కేవలం బ్రోకర్ల మాయమాటలతో తాము ఈ మురికి కూపంలో ఇరుక్కుపోయినట్లు విదేశాల్లో ఉన్న జిల్లా మహిళలు వాపోయినట్లు సమాచారం. నెల్లూరు నుండి లగ్జరీ కార్లలో మాయమాటలు చెప్పి ఇక్కడే మహిళలకు కొంత ఆర్థిక సహాయం అందించి లగ్జరీ షాపింగ్‌లు చేయించి చెనై్నకు తీసుకెళ్తున్నారు. కష్టమొకరిది- సుఖం మరొకరిది అన్నట్లుగా బ్రోకర్లు వీరిని విదేశాలకు పంపించి జిల్లాలో అత్యంత విలాస జీవితాలను గడుపుతోంటే సదరు మహిళలు అక్కడ అనేక కష్టాలు పడుతున్నారు.
వాళ్లు తిరిగి స్వదేశానికి వచ్చేటప్పుడు డబ్బులు సంగతి దేవుడెరుగు- జబ్బులు మాత్రం విపరీతంగా మోసుకొస్తున్నారు. అధికారులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకీ హైటెక్ పంథాలో ఈ వ్యభిచారాన్ని హైటెక్ బ్రోకర్లు నెల్లూరు నుంచి ఫారిన్‌కి నిత్యం ఏదోఒక ప్రాంతం నుంచి కొనసాగిస్తున్నారని సమాచారం. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి ఆయా ప్రాంతాల నుంచి మద్రాస్‌కు తరలిస్తున్న మహిళలను బ్రోకర్ల చెర నుంచి విడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment