రాష్ర్టమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కోవూరు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న ఈ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతుపట్టక అన్నిపార్టీల నేతలు సతమతమవుతున్నారు. వారిని ప్రసన్నంచేసుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇపుడు రాష్ర్ట నేతలు, విశ్లేషకుల దృష్టి త్వరలో జరిగే కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మీదే ఉంది. అన్ని ప్రధాన పక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
టిడిపి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,కాంగ్రెస్ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు, సిపిఎం నుంచి జొన్నలగడ్డ వెంకమరాజు బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పక్షాలు ఈ ఎన్నికను అత్యంతప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపుకోసం పూర్తిస్థాయి కసరత్తుల ప్రాంభించారు. అయితే ఇక్కడి ఓటరు నాడిపట్టుకోవటం నాయకులకు చాలా కష్టమైన పని.
గత ఎన్నాకల ఫలితాలే ఈ విషయం వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, టిడిపిలు ఆరేసి సార్లు ఇక్కడ విజయం సాధించగా సిపిఐ రెండుసార్లు గెలిచింది. ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఈసారి కూడా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి తరఫున పోటీచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈనియోజకవర్గం కొత్తది కావటం, ఎప్పుడూ తమకు మద్దతిచ్చే సిపిఎం ఈసారి పోటీకి దిగటం ప్రతికూల అంశాలు. అయితే తనకున్న అపార అనుభవంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని కోవూరు ఉప ఎన్నికలో తన విజయం తథ్యమని సోమిరెడ్డి అంటున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే అభ్యర్థి ఎంపికలో బాగా ఆలస్యం చేసి ప్రచారంలో కాస్త వెనకబడింది. అయితే సోమిరెడ్డి, ప్రసన్న ఇద్దరూ టిడిపి ఓట్లమీదే ఆధారపడ్డారు కనుక తమ ఓటుబ్యాంకుకు ఢోకా లేదని కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అంటున్నారు. ప్రస్తుతం నామినేషన్ల పర్వం పూర్తవటంతో అభ్యర్థులు ప్రచారపర్వంలో తలమునకలై ఉన్నారు.అయితే ముందు ముందు ఎవరు ముందుకు సాగుతారు ఎవరు చెతకిలబడతారో వేచిచూద్దాం!
No comments:
Post a Comment