నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌ల కారణంగా అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితికి చేరుకున్నారు. ఏ వస్తువు కొనాలన్నా విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మాది పేదల పార్టీ అని, పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, అందుకు సంబంధించి చెప్పడం, అధికారంలోకి రావడం జరిగింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రస్తుతం పేద, మధ్యతర గతి ప్రజల నడ్డి విరిచేవిధంగా ప్రభుత్వ వ్యవహారం ఉండడంతో ప్రజల్లో నిరాసక్తత నెలకొంది. మీ పని మీరు చేసుకుని పొండి, రానున్న ఎన్నికల్లో మాపని మేం చేస్తామని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండు నెలల నుంచి విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిన ప్రభుత్వం తాత్కాలికంగా సర్ చార్జీలను కొద్దిగా తగ్గించడంతో దీనివల్ల ప్రయోజనం లేదని ప్రజలు అంటుండగా విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. పెంచిన విద్యుత్ చార్జీల్లో కేవలం సర్ చార్జీలు తగ్గించడంలో తమకు ఏమీ ప్రయోజనం లేదని ప్రజలు అంటున్నారు. నిత్యావసర వస్తువు ఏది కొనాలన్నా కిలో రూ.90ల నుండి రూ.120ల లోపు ఉంటున్నాయి. అలాగే 49-51 రూపాయల మధ్యలో ఉండిన కిలో నూనె ప్యాకెట్ ప్రస్తుతం 82-84 రూపాయల మధ్యలో అమ్ముతుండడంతో పేద ప్రజలు దినసరి కూలీల మీద ఆధారపడి జీవించేవారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీనికి తోడు కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిఒక్క కూరగాయ కిలోకు రూ.25ల నుండి రూ.30లకు తక్కువ లేదంటే తాము ఏవిధంగా బతుకులు ఈడ్చాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలను విస్మరిస్తున్న ప్రభుత్వం తమ ఇష్టానుసారం ప్రతిఒక్క వస్తువుపైన రేట్లు పెంచడంతోపాటు వ్యాట్ పేరు మీద అదనపు భారాన్ని వేయడంతో కనీసం కొనుగోలు చేసేందుకు దుస్తులు కూడా అందుబాటు ధరల్లో లేవని పేదలు చెబుతున్నారు. అలాగే ఇటీవల వ్యాట్ పేరుతో బంగారంపు ధరలను కూడా విపరీతంగా పెంచేయడంతో ఉన్నతస్థాయి కుటుంబాల్లో కూడా ప్రభుత్వ చర్యలపట్ల అసమ్మతి చెలరేగుతోంది. ఎన్నికల ముందు ఒక మ్యానిఫెస్టోను, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మ్యానిఫెస్టోను పార్టీలు పెడుతుండడంతో ప్రజల్లో పార్టీలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనికి ఉదాహరణగా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలో అధికార పార్టీకి 3వ స్థానం దక్కడం ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరిలో విపరీతంగా పెరిగిపోయిన రేట్లపైనే చర్చలు జరుగుతున్నాయనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏ వస్తువు రేట్లు పెంచినా పోరాటాలు చేసే ప్రతిపక్షం, వామపక్షాలు కూడా నామ్‌కే వాస్తుగా పోరాటాలు చేసి చేతులు దులుపుకుంటుం డడంతో వారిపై కూడా ప్రజలు అపనమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఇంటి పన్నులు, మంచినీటి కుళాయిలు, విద్యుత్, పలసరుకులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల న్నింటిపై వ్యాట్ పేరుతో విపరీతంగా బాదుతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజల బతుకు మరీ ఛిద్రమవుతోంది. వీరిని దృష్టిలో ఉంచుకోనైనా వ్యాట్‌ను తొలగిస్తే కొంతలో కొంతైనా చార్జీలు తగ్గించే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం, పాలకులు ఈ దిశలో ఆలోచించకుండా తమ తమ పదవులను, అధికారాన్ని కాపాడుకోవడంలోనే కాలయాపన చేస్తూ ప్రజా సమస్యల పట్ల స్పందించకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందుకే మీపాటికి మీరు రేట్లు పెంచండి, మేము సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతామంటున్నారు.
No comments:
Post a Comment