నెల్లూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని పాలకులు తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శంకరయ్య డిమాండు చేశారు. స్థానిక యుటిఎఫ్‌కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థుల శాతం రోజురోజుకూ తగ్గుతోందన్నారు. ఆ శాతం ప్రయివేటు పాఠశాలల్లో పెరుగుతోందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని ప్రాథమిక పాఠశాలలను జనవిజ్ఞాన వేదిక బృందం పరిశీలించి అధ్యయనం చేసిందన్నారు. అక్కడి పాఠశాలల వాతావరణం, ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్య తల్లిదండ్రుల్లో మంచి భరోసా కల్పిస్తున్నాయన్నారు. అందువల్లే ఆ రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు తమపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నాయని తెలిపారు. మనరాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతోనే ప్రయివేటు విద్యాలయాలపై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రయివేటు విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తుండడంతో ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక పాఠశాలలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల హాజరు, ఉత్తీర్ణతా శాతాలు తగ్గడంపై ప్రభుత్వం రకరకాల సర్వేలు, ప్రయోగాలు చేస్తుందేగాని అందుకు గల కారణాలను మాత్రం విశ్లేషించడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ప్రతి మండలంలో నాణ్యమైన విద్య బోధించే పాఠశాలలను ఏర్పాటు చేసి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ రంగ విద్యపై నమ్మకం కలిగించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో మునిగి తేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయక, మిల్లర్లు కారుచౌకగా అడుగుతుండడంతో రైతులు ధాన్యాన్ని పొలాలు, రోడ్ల వెంబడి ఆరబెట్టుకుని రేటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ సంక్షోభంపై జనవిజ్ఞాన వేదిక మే 2వ వారంలో చర్చావేదిక నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యుత్‌కోతలు తీవ్రం కావడంతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి అవసరమైన 12500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అదనంగా 28,800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను చేపట్టారని, అవి ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు. ఆ ధర్మల్ కేంద్రాలన్నీ నెల్లూరు తీర ప్రాంతాన్ని కలుషితం చేయనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment