నెల్లూరు/ విజయవాడ: ఆంధ్రులు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుందని, చెప్పులేకుండా హైదరాబాద్ వచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల గురించి, వారు చెప్పుల్లేకుండా హైదరాబాద్ వచ్చారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే నవ్వొస్తోందని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు.
ప్రజల మధ్య విద్వేషాగ్నులు రగిల్చడానికి కేసీర్ నానా పాట్లు పడుతున్నాడనీ, కెసిఆర్‌కు మతిభ్రమించిందని ఆయన అన్నారు. తెలుగుజాతి, తెలుగుప్రజలు అంతా అన్నదమ్ముల్లాంటివారనీ, వీరిలో ఒకరు ఎక్కువా... ఇంకొకరు తక్కువా అనే బేధం లేదన్నారు. స్వార్థప్రయోజనాలకోసం ప్రాంతీయవాదాన్ని తలకెత్తుకున్న కేసీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిదన్నారు.
ఇక ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడటంలో తప్పేమీ లేదని, రాజకీయాల్లో ఇవన్నీ సహజమన్నారు. అయినా చిరంజీవి తనకు మంచి స్నేహితుడు, మంచివాడని కితాబిచ్చారు. అటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు పోదామని అడగటంలో ఎటువంటి తప్పూ లేదని ఆనం అన్నారు.చిరంజీవితో కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి, వైఎస్ జగన్ వర్గానికి వచ్చిన ఇబ్బందేమిటో తనకైతే అర్థం కావడం లేదన్నారు.
No comments:
Post a Comment