నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టుపై ఎపి జెన్‌కో దృష్టి మళ్లినట్లు తెలుస్తోంది. వాడరేవు 4000 మెగావాట్ల అల్ట్రామెగా విద్యుత్ ప్రాజెక్టుల విషయమై స్థానికుల నుంచి నిరసనలు పెద్ద ఎత్తున తలెత్తడంతో దాదాపు అంతే సామర్థ్యంగల కృష్ణపట్నంపై దృష్టి సారించాలని యోచించిన ఇంధనశాఖ అధికారులు ఇందుకోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతిని కోరినట్లు సమాచారం. కృష్ణపట్నం అల్ట్రామెగా విద్యుత్ ప్రాజెక్టును 3960 మెగావాట్ల (6×660) సామర్థ్యంతో అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, స్థానిక బొగ్గు ఉత్పత్తిదారులు మార్కెట్ ధర ప్రకారం బొగ్గు సరఫరా చేయాలనే ఇండోనేషియా చట్టంలో తీసుకొచ్చిన మార్పులు, ఇతర కారణాల వల్ల రిలయన్స్ సంస్థ ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ ఇండోనేషి యాలో మూడు బొగ్గు గనులను సేకరించింది. ఏటా 15మిలియన్ టన్నుల బొగ్గు కృష్ణపట్నం ప్రాజెక్టుకు అవసరం కాగలదు. దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టును రిలయన్స్ సంస్థకు అప్పగించినప్పటికీ బొగ్గు సరఫరా విషయంలో ఇండోనేషియా చట్టంలో మార్పులు తేవడంతో కృష్ణపట్నం ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోతుంది. పైగా ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రంతో సహా మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడులు రిలయన్స్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి రిలయన్స్ సంస్థ తప్పుకోవటంతో కృష్ణపట్నం ప్రాజెక్టును తమకు అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ ఇంధన శాఖ అధికారులు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం కేంద్రం నుంచి సమాధానం కోసం వేచిచూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రకాశం జిల్లా, నాగులప్పడపాడు మండలం, కనుపర్తి గ్రామంలో రూ.24,000 కోట్ల వ్యయంతో 2,043 ఎకరాల స్థలంలో వాడరేవు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును చేపట్టాలని ఎపిజెన్‌కో యోచించింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యంతో తమ జీవితాలు పాడవుతాయన్న భయంతో గ్రామస్తులు ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాడరేవు ప్రాజెక్టు కోసం దశలవారీగా జెన్‌కో ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని సిద్ధపడింది. కానీ, స్థానికంగా నిరసనలు, వ్యతిరేకత కారణంగా వాడరేవు ప్రాజెక్టుకు బదులుగా కృష్ణపట్నం ప్రాజెక్టుపై దృష్టిని సారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
No comments:
Post a Comment