తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 6న జిల్లాకు వస్తున్నారు. రైతు పోరు బాటలో భాగంగా ఆయన జిల్లాలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇప్పటికే 21 జిల్లాల్లో రైతు పోరుబాటను పూర్తి చేసిన చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 6న జిల్లాకు వచ్చి ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో రైతు పోరు బాటను నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం జిల్లా నేతలకు సమాచారం అందింది. అధినేత పర్యటన ఖరారు కావడంతో రైతు పోరుకు సంబంధించిన రోడ్డు మ్యాప్‌ను తయారు చేసేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బీద రవిచంద్ర, నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బొల్లినేని రామారావు తదితరులు శనివారం ప్రత్యేక సమావేశం కానున్నారు.
టీడీపీ శ్రేణుల్లో ఆనందం... పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 15 రోజుల వ్యవధిలో రెండో సారి జిల్లాకు వస్తుండడంతో పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లాలో రైతు పోరు బాట సందర్భంగా ఈనెల 20న చిత్తూరు నుంచి వెళుతూ కావలి నియోజకవర్గంలో చంద్రబాబు రైతుపోరు బాట నిర్వహించిన విషయం తెలిసిందే. కావలి ప్రాంతంలో దెబ్బతిన్న పుచ్చ, శెనగ పంటలను చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడడం, కోవూరు ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చిచడంతో పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. రెండో దఫా ఫిబ్రవరి 6న వస్తుండడం ఒక రోజు పాటు రైతు పోరు బాట నిర్వహిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
No comments:
Post a Comment