online marketing

Wednesday, February 10, 2010

జాతీయ రహదారిపై వేరుశనగ లారీ బోల్తా

తడ, మేజర్‌ న్యూస్‌:ప్రమాద సమయాల్లో సాటి మనిషికి సాయం చేయాల్సింది పోయి అక్కడ దొరికిక లక్షల రూపాయలు విలువచేసే వందలాది బస్తాలను లూటీ చేసిన సంఘటన తడ మండలం కొండూరులో చోటుచేసుకుంది. సమాచారం మేరకు వరంగల్లు నుండి తమిళనాడు ఎన్నూరుకు 8లక్షల రూపాయలు విలువచేసే 340 వేరుశనగ బస్తాలతో వెళ్లుతున్న లారీ బుధవారం ఏకువజామున అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో గాయపడ్డ లారీ డ్రైవర్‌ విజయ్‌ను చికిత్స నిమిత్తం 108ద్వార సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆ సమయంలో బోల్తా పడిన లారీ వద్ద క్లీనర్‌ కార్తీక్‌ ఒక్కడే ఉండడాన్ని గమనించిన సమీప కొండూరు, సుందరపురం, అక్కంపేట గ్రామస్తు లో కొందరు లారీలోని పప్పు బస్తాలను అర్ధగంటలో లూటీ చేసి ఏమీ తెలీనట్లు ఉండిపోయారు. విషయం తెలుసుకున్న సూళ్ళూరుపేట పేట సిఐ వంగా సుబ్బారెడ్డి సర్కిల్‌ పరిధిలోని తడ, సూళ్ళూరుపేట, శ్రీహరికోట పోలీసులను అప్రమత్తం చేసారు. అప్పటికే సంఘటనా స్ధలానికి చేరుకున్న తడ ఎస్‌ఐ హరికృష్ణ లారీలోని బస్తాలు మాయమవడంపై అవాకై్కయ్యారు. వెంటనే గ్రామ సర్పంచ్‌ రవిరెడ్డిని వెంటబెట్టుకొని గ్రామాల్లోని అన్ని ఇండ్లను సోదాలు చేసి బస్తాలను బయటకు తీసుకొచ్చారు. సోదాలను గుర్తించిన గ్రామస్తులు లూటీ చేసి గృహాల్లో దాచిన బస్తాల విషయం ఏమీ తెలీనట్లుగా పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తాళాలు వేసుకొని మరీ దగ్గరుండి చోధ్యం చూసారు. అయితే పోలీసులా మజాకా అన్న తీరులో ప్రతి ఇంటిని సోదాచేసి దొంగలించిన బస్తాలను వెలికితీసారు.అంతేగాకుండా కొందరు తెలివిగా గడ్డివాముల్లో, ఇసుక గుట్టల్లో, ఇంటి పైభాగాలలో పరిసర చెట్లలో దాచిన అన్ని బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో గ్రామస్ధులతో పాటు అటు ఇటు వెళ్లుతున్న వాహనాల్లో బస్తాలను తస్కరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రమాద సమయాల్లో వాహనాలనుండి వస్తువులను దొంగలించడం పెద్ద నేరంగా పేర్కొన్నారు. వెంటనే దొంగలించిన బస్తాలను పోలీసులకు అప్పగించాలని గ్రామస్ధులను ఆదేశించారు. లూటీ చేసిన వారందరపై కఠిన కేసులు బనాయించనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో లూటీ పనులు చేస్తే గ్రామస్ధులందరిపైనా కేసులు పెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో జరిపిన తనిఖీల్లో ఎస్‌ఐలు ఎం. శ్రీనివాసరావు, కె. శ్రీనివాసరావులతో పాటు పోలీసు సిబ్బంది, విఆర్‌వో, గ్రామ సేవకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh