Tuesday, February 9, 2010
అగస్త్యముని ప్రతిష్టించిన సంగమేశ్వరుడు
కోట, (మేజర్‌న్యూస్) : కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం అత్యంత పురాతనమైంది.ఒకప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలువబడిన ఈ గ్రామంలో సప్తమహర్షుల్లో ఒకరైన అగస్త్యమహాముని తన స్వహస్తాలతో స్వయంగా ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తిరుపతి-చంద్రగిరి కొండల మధ్య తపస్సు చేస్తూ వచ్చిన అగస్త్యుడు ఒకనాడు సముద్ర స్నానానికి వెళుతూ కూడలి వద్ద ప్రస్తుత గూడలి గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో స్నానం చేశాడని పూజ చేసుకునేందుకు అగస్త్యమహాముని శివలింగాన్ని స్థాపించాడని ప్రచారంలో ఉంది.స్వర్ణముఖి నదిలో కూడలి వద్ద రెండు నదులు కలుస్తూ కొంతదూరం తరువాత రెండుగా విడిపోవడం గమనించిన అగస్త్యుడు ఈ ప్రాంతానికి కూడలి అని నామకరణం చేశాడని ప్రచారంలో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఒకప్పటి తొండమనాడు చక్రవర్తి ఈ ప్రదేశానికి వచ్చి సరైన నీడ లేకుండా పడిఉన్న శివలింగానికి ఆలయ ప్రకారాలు నిర్మించాడని ప్రతీతి. ఈ ఆలయం నిర్మించిన ప్రదేశం కాళాభారమ్మ, నీలి భారమ్మ అనే అక్కా చెల్లెళ్లు గ్రామ దేవతలకు చెందిందని చెబుతారు. స్వర్ణముఖి నది తీరాన ఉన్న ఈ ఆలయంలో శ్రీ సంగమేశ్వరుడు, శ్రీ కామాక్షిదేవికి వేర్వేరు గర్భగుడులు, ఆలయాలున్నాయి. ఉత్తరం గ్రామ శక్తులు కాళాభారమ్మ, నీలాభారమ్మకు ప్రత్యేక గుడి ఉంది. ఇంకా నందీశ్వరుడు వినాయకుడు, వీరభద్రస్వామి, నాగప్రతిష్ట, సుబ్రమణ్యేశ్వరస్వామి, చండీశ్వరుడు, కాళ భైరవుడు, మధ్యలో ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. అమ్మవారికి ఎదురుగా సింహం, ఈశాన్యంలో నవగ్రహ ప్రతిష్ట, స్వామివారి కళ్యాణ మండపం ఉన్నాయ. ఇక్కడి శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి వారికి శివరాత్రి కార్తిక పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజలతోపాటు ఏటా చైత్ర మాసంలో శైవ ఆగమసూత్రాల ప్రకారం 11 రోజులపాటు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. గ్రామంలోని కొండమీద వెలిసిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం కూడా పురాతనమైనది. ప్రతి శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరిగే గూడలి కొండ తిరునాళ్లకు చేరుకుంటారు. ప్రస్తుతం దాతల సహకారంతో ఆలయానికి ముందువైపు అసంపూర్తిగా ఉన్న గోపురం నిర్మాణానికి ఎంఎస్ రెడ్డి అనే దాత ఆర్ధిక సహాయంతో పూర్తి చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment