Saturday, February 13, 2010
సమర్థతకు విలువెక్కడ?
నెల్లూరు(క్రైం), మేజర్‌న్యూస్: శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు పోలీసులు లాఠీలకు పనిచెబితే పోలీస్‌ల క్రౌర్యం అంటూ ఉంటాం. అదే పోలీసులు ప్రస్తుతం నేతల క్రౌర్యానికి బలైపోతున్నారు. ఈ బలయ్యే క్రమంలో కనీసం సమర్థతకు కూడా అవమానాలు ఎదురుకాక తప్పని పరిస్థితి. ఆత్మాభిమానం కలిగిన పోలీస్ అధికారులు చివరకు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయేందుకు కూడా వెనుకాడడం లేదు. నగరంలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నేతల విపరీత జోక్యం కారణంగా కేసులు తారుమారవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులే నిందితులుగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాల్సి వస్తోంది. ముఖ్యంగా అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నగరంలోని పోలీస్‌స్టేషన్లలో కేసులు నడుస్తున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. సివిల్ వ్యవహారాలను సైతం అధికారపార్టీ నేతలు పోలీస్‌స్టేషన్ నాలుగు గోడల మధ్యన మధ్యస్తం చేయిస్తూ, అందులోనూ తమ లాభం చూసుకుంటున్నారు. ఇటీవల మినీబైపాస్‌లో ఓ స్థల వివాదమై పోలీస్ అధికారుల సమక్షంలో అధికారపార్టీకి చెందిన కొందరు ఛోటానేతలు స్థలాన్ని స్వాధీనపర్చుకోవడంలో తమ హవా నిరూపించుకున్నారు. దీనికితోడు నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 24 గంటలూ సివిల్ వ్యవహారాల్లో తలదూరుస్తూ, పోలీసుల సైతం సివిల్ వ్యవహరాల్లో తలదూర్చేలా ఒత్తిడి తీసుకువస్తుండడం గమనార్హం. తమ పనులకు సహకరిస్తూ, సన్నిహితంగా ఉండే పలువురు అధికారులను నగరంలోనే కొలువుండేలా చేయడంలో అధికారపార్టీ నేతలు కృతకృత్యులవుతున్నారు.ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే నగర పరిధిలోని మరో స్టేషన్‌కే వీరు బదిలీ అవుతున్నారు తప్ప నగరం విడిచి బైటకు బదిలీ కాని పరిస్థితి. కొందరు స్టేషన్ అధికారులు తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ కావడమే కాకుండా తమతోటి తాము విశ్వసించే కిందిస్థాయి సిబ్బందిని కూడా తాము వెళ్తున్న చోటికే బదిలీ చేయించుకోవడం విశేషం. ఒకటవ నగర విషయంలోనూ ఇప్పటివరకూ అక్కడ పనిచేస్తున్న ఎసై్స మెడికల్ లీవ్ పెట్టి వెళ్లడం వెనుక అధికారపార్టీకి చెందిన కొందరు నేతలే కారణంగా తెలుస్తోంది. వారి విపరీత జోక్యానికి విసిగిపోయిన సదరు అధికారి బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా కాక మునుపే అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవడం జరిగింది. జిల్లాలో ఎన్నో ప్రధాన దోపిడీ, దొంగతనాలను చేధించిన అధికారిగా ఆయనకున్న సమర్ధత కూడా నేతల పంతం ముందు ఉన్నతాధికారుల వద్ద గెలవలేకపోయింది. రాజకీయ పార్టీ నేతలూ, అందులోనూ అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఉంటూ వారి అడుగులకు మడుగులొత్తే అధికారుల మాత్రమే నగరంలో కొలువుండే పరిస్థితి ఏర్పడిందని పలు ప్రజాసంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment