నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్:పాఠశాల స్థాయి విద్యార్థులకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్ అని నగర మేయర్ నందిమండలం భానుశ్రీ పేర్కొన్నారు. మారుతున్న కాలంలో వింత పోకడలు పోతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు నైతిక విలువలను నేర్పి ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఆదివారం స్థానిక విఆర్‌సి మైదానంలో నిర్వహించిన విబిఆర్ పబ్లిక్ స్కూల్ పదవ వార్షికోత్సవంలో ఆమె మాట్లాడుతూ చదువులతోపాటు సంస్కారం అవసరమన్నారు. నేటి తరానికి పుస్తకపఠన ఆవశ్యకతను తెలియజేసి రేపటి తరం మంచి పౌరులుగా వారిని తీర్చి దిద్దాలన్నారు. పాఠశాలలోని చదువులతోపాటు విద్యార్థి దశలో తల్లిదండ్రుల పరిరక్షణ అవసరమన్నారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవితంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించాలన్నారు. చదువులేకాక ఏకాగ్రతను పెంచే వివిధ అంశాలలో పిల్లలకు ప్రవేశం కల్పించి మానసిక వత్తిడిని తగ్గించాలన్నారు. జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు చాట్ల నరసింహరావు మాట్లాడుతూ విద్యావంతులు ప్రపంచంలో ఎక్కడైనా గౌరవించబడతారని విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారణం నైతిక విలువలతో కూడిన విద్యేనని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కమిషనర్ టిఎస్‌ఆర్ .ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి దేశంలో భారతీయ విద్యార్థులు తమ సత్తాను చాటుతున్నారని అన్నారు. సాంప్రదాయ విద్యతోపాటు సాంకేతికంగా అభివృద్ధి చెంది విద్యార్థులు అన్ని రంగాలలో అగ్రగాములుగా నిలవాలన్నారు. విబిఆర్ విద్యాసంస్థల డైరెక్టర్ వేగూరు శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విబిఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ ఊటుకూరు బ్రహ్మంరెడ్డి, వైస్ ఛైర్మన్ ఊటుకూరు శ్రీనివాసులురెడ్డిలు మాట్లాడుతూ నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి తమ సంస్థలు కృషి చేస్తాయని అన్నారు. పదేళ్లుగా తమ విద్యాసంస్థలు గొప్ప సంకల్పంతో విద్యార్థులోని శక్తి సామర్ధ్యాలను వెలికి తీస్తున్నామన్నారు. వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారీ సెట్టింగులతో, అత్యాధునిక విద్యుత్ సాంకేతిక పరిఙ్ఞానంతో ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారుల నృత్య ప్రదర్శనలు పలువురిని అలరించాయి. చిన్నారుల చిట్టిపొట్టి మాటల రైమ్స్, నృత్యాలు, కరాటే విన్యాసాలలతోపాటు సాంప్రదాయ, ఆధునిక సాంస్కృతిక ప్రదర్శనలు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధులు మెమొంటోలను, షీల్డ్‌లను అందజేశారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకలో పిల్లలతోపాటు తల్లిదండ్రులు, నగరంలోని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment