Saturday, February 6, 2010
నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్
నెల్లూరు, మేజర్‌న్యూస్ ప్రతినిధి : నాలుగైదు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 50 శాతం ఖర్చులు భరించేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య అంగీకరించారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై రోశయ్య కేంద్ర రైల్వే మంత్రి మమతాబెనర్జీతో చర్చించిన మీదట రైల్వేలైను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పొందినట్లు ఎంపి ‘మేజర్‌న్యూస్’కు తెలిపారు. రాష్ట్రంలో రైల్వే శాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆరు పనులలో ఒకదానికి 2/3వ వంతు, మిగిలిన ఐదు పనులకు 50 శాతం చొప్పున ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకారాన్ని లిఖితపూర్వకంగా మమతాబెనర్జీకి తెలిపినట్లు ఎంపి వివరించారు. ఈ రైలు మార్గం నిర్మాణానికి 1310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆయన చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య సుమారు 309 కిలోమీటర్ల పొడవున అన్ని వెనుకబడిన ప్రాంతాల మీదుగా నాలుగుజిల్లాలను తాకుతూ నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల మీదుగా సాగుతూ గతంలోని రైల్వే మార్గం కంటే 169 కిలోమీటర్లు తగ్గి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ప్రయాణానికి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. ఈ మార్గం నిర్మాణం ద్వారా ఇందన పొదుపు, తద్వారా జాతీయ పొదుపునకు అవకాశం కలుగుతుందని చెప్పారు. అదేవిధంగా తుపాను, ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో హైదరాబాద్, చెనై్న, కర్నాటక, కేరళ రాష్ట్రాలమధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గం ఏర్పడినట్లు అవుతుందని ఆయన వివరించారు. ఈ రైలు మార్గం ఏర్పాటుకు 2005 జనవరి నెలలో ఒకసారి, 2007 సెప్టెంబర్ నెలలో మరోసారి సర్వే జరిగిందని ఆయన అన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంతో పాటు హైదరాబాద్-సికింద్రాబాద్‌లలో ఎంఎంటిఎస్ రైల్వేలైను, భధ్రాచలం - కోవూరు రైల్వేలైను, మనుగూరు-రామగుండం రైల్వేలైన్లు మంజూరు అయ్యాయని ఎంపి మేకపాటి వివరించారు. అదేవిధంగా విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం-నిడదవోలు లైను డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు, గుంటూరు-తెనాలి-రేపల్లె మార్గం డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు నిధులు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపిందని ఆయన అన్నారు. రాష్ర్టంలో ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను ఏర్పాటుకు ముందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు, కేంద్ర మంత్రి మమతాబెనర్జీకి ఎంపి మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment