Friday, February 5, 2010
మత్తులో చిత్తవుతున్న యువత---
నెల్లూరు(క్రైం)మేజర్‌న్యూస్:జిల్లాలో యువకులు, విద్యార్థులు, బిచ్చగాళ్లు , పిల్లలు సైతం గంజాయి, హెరాయిన్, పెంటజోసిన్ వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొంతమంది రిక్షా పుల్లర్లు రైల్వే స్టేషన్ల్ వద్ద గంజాయి వంటి మాదకద్రవ్యాలను సేవించి మత్తులో మునిగితేలుతూ తమ జీవితాలను రైలు చక్రాల క్రిందనే చాలిస్తున్నారు. సంవత్సరానికి మత్తు పదార్ధాలపై రూ.కోట్లపైనే ఆదాయం మాదకద్రవ్యాలు, మత్తుపదార్ధాల వంటి వాటిని అక్రమంగా అమ్మకాలు జరుపుతుండటం వలన జిల్లాలో ఏటా కోట్ల రూపాయలలో అక్రమార్జన చేస్తున్నారు. ఈ వ్యాపారం చేసేవాళ్ళు లక్షల్లో ఆదాయం గడిస్తుండటంతో అధికారులకు ముడుపులు కూడ భారీగానే అందుతున్నట్లు సమాచారం. ముడుపులు భారీగా ఉండటంతో కేసులను సైతం లెక్కచేయక యథేచ్ఛగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.ప్రధాన కేంద్రాలుగా: నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్, స్టోన్‌హోస్‌పేట, రైల్వేఫీడర్స్‌రోడ్, మూడుహాళ్ళసెంటర్, వెంకటేశ్వరపురం, కావలిలోని వడ్డిపాలెం, పెద్దపవనిరోడ్డు, గూడూరు రైల్వేస్టేషన్, బనిగిసాహెబ్‌పేట, మాయబజార్, సూళ్లూరుపేట, నాయుడుపేట వంటి ప్రాంతాలలో గంజాయి, నల్లమందు వంటివాటిని అమ్మకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అయితే హెరాయిన్, మార్ఫిన్ వంటి మాదకద్రవ్యాలు చెనై్న నుంచి రైళ్లలో జిల్లాలోని గూడూరు, నెల్లూరు, కావలికి తీసుకొని వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. వీటికి తోడు స్పిరిట్ , డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి మాత్రలు మత్తుకు ఉపయో గిస్తున్నారు. అంతేగాక పెంటజోసిన్ వంటి ఇంజక్షన్లను శరీరంలోకి సూదుల ద్వారా ఎక్కించుకుంటున్నారు. సాధారణంగా డాక్టర్లు ఇచ్చే మందుల చీటి లేనిదే మెడికల్ షాపుల్లో మత్తుతో కూడిన మందులు ఇవ్వరాదు. అయితే వ్యాపారం కోసం దుకాణాదారులు విచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నారు.గంజాయి తోటలుగా: సీతారామపురం, ఉదయగిరి వంటి ప్రాంతాల్లో చడిచప్పుడు లేకుండా గంజాయితోటల పెంపకం జరుగుతోంది. దీనికి తోడు ప్రక్క జిల్లాల నుంచి ఈ గంజాయి మన జిల్లాకు వాహనాల ద్వారా చేరుతున్నాయి. ఒక్కొక్కసారి అధికారులు దాడులు నిర్వహించినా అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. నిందితులను పట్టుకున్న వెంటనే రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గటం, ఆర్థిక, అంగబలం ముందు ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు చిన్నచిన్న వ్యాపారులపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారే తప్ప అసలు నిర్వాహకులను పట్టుకొని కేసులు నమోదు చేయటంలేదనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు చొరవ చూపి మత్తు మందులను అనధికారకంగా, ఇష్టారాజ్యంగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment