Wednesday, February 3, 2010
సోమశిలలో రైతు ఆత్మహత్య
ఆత్మకూరు, (మేజర్‌న్యూస్): కుటుంబాన్ని పోషించాలని అప్పులు చేసి పుడమితల్లిని నమ్ముకున్న రైతన్న చేసిన అప్పులను భరించలేక ఏకంగా తనువు చాలించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి..అనంతసాగరం మండలం సోమశిలలో మంగళవారం సాయంత్రం ఓ రైతు అప్పుల బాధను తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమశిల నాూబ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న సిద్దవఠం కృష్ణయ్య (40) పికెపాడు పైతట్టు ధర్మపల్లెమ్మ దేవాలయం సమీపంలో ఒకటిన్నర ఎకర పొలం వరి సాగు చేస్తున్నాడు. మరో ఎకరా పొలం మరమ్మతుల్లో ఉంది. పొలం సాగు కోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో ఎక్కువ కావడం దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.దీంతో మంగళవారం సాయంత్రం పొలంలోకి వెళ్లి పురుగుల మందు పిచికారి చేసి వస్తాయని చెప్పి వెళ్లిన కృష్ణయ్య అదే పురుగులు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో కృష్ణయ్య చుట్టుపక్కల వారికి స్పృహ తప్పి కిందపడిపోయి ఉండడం కనిపించడంతో ఆందోళనతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టు పక్కల రైతులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసే సరికి పురుగుల మందు సేవించి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కృష్ణయ్యను టాటాసుమోలో తరలించి ఆత్మకూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.మృతునికి భార్య జయమ్మ, ఓ వివాహమైన కుమార్తె, ప్రసాద్, మహేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పొలం పనికి వెళ్లి మృతదేహమై తిరిగి వచ్చిన తండ్రిని చూసుకున్న పిల్లలు, భార్య జయమ్మ బోరున విలపించడంతో చూపరులను సైతం కంటి తడి పెట్టించింది. మొత్తం మీద నాూబ్రాహ్మణ కాలనీ దుఃఖసాగరమైంది. కుటుంబ పోషకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment