Friday, February 5, 2010
వికలాంగులకు బంగారు బాటలు
ఫత్తేఖాన్‌పేట (నెల్లూరు) మేజర్‌న్యూస్:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న వికలాంగ బాలబాలికలకు కృత్రిమ అవయవాలను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలను వేయాలని జిల్లా పరిషత్ అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో వికలాంగులకు కృత్రిమ అవయవములను అందించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ప్రతిసారి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు అందించడం పరిపాటైందని, ఈ సారి వికలాంగులకు ఉపయోగపడేవిధంగా వినూత్న రీతిలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ లోగా ఈ ప్రణాళికను కార్యాచరణకు తేవాలని వికలాంగులశాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావును ఆదేశించారు. జడ్పీ నిధులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వికలాంగ బాలబాలికలకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు. గుర్తింపు పొందిన స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో చదివే బాలబాలికలకు ద్వితీయ ప్రాధాన్యతగా కృత్రిమ అవయవములను అందించాలన్నారు. జిల్లా పరిషత్ హెడ్మాస్టర్లు వారి హైస్కూళ్లలోని వికలాంగుల వివరాలను సేకరించి, వారికి కావాల్సిన కృత్రిమ అవయవాల వివరాలను, ఉపకరణాల జాబితాను తయారు చేసి ఎంపిడిఒల ద్వారా జిల్లా పరిషత్‌కు పంపించాలన్నారు. రాజీవ్ విద్యామిషన్ వారు ఇప్పటికే అట్టి జాబితాను తయారు చేసివున్నట్లయితే ఆ జాబితాను జిల్లా పరిషత్‌కు పంపించాలన్నారు.జిల్లాలోని వికలాంగులైన విద్యార్థులను గుర్తించి వారికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికలను, ప్రధానోపాధ్యాయుల నుంచి ధృవీకరణ పత్రాలను స్వీకరించాలని తెలిపారు. వికలాంగులు సమాజంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చూడాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. చదువుకునే వికలాంగులైన చిన్నారుల కోసం వినూత్న రీతిలో అమలుపరచే ఈ కార్యక్రమాన్ని మార్చి మొదటివారంలో ప్రారంభించి రూ.10 లక్షలు విలువ చేసే కృత్రిమ అవయవాలను వారికి అందించేందుకు సంకల్పించామన్నారు. ఇందుకోసం రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి కృత్రిమ అవయవాలను తయారు చేసే నిపుణులను నెల్లూరుకు రప్పించి మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.రామిరెడ్డి, డిప్యూటీ సిఇఒ ఎస్‌ఎస్.ఆంజనేయరాజు, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment