Friday, February 5, 2010
నిపుణులు లేకుండానే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
నెల్లూరు, మేజర్‌న్యూస్ ప్రతినిధి : ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలంటే వాటికి తప్పనిసరిగా ఆయా రంగాల్లో నిపుణులైన వైద్యులు ఉండాలి. ఈ నిబంధనలను అన్ని ఆస్పత్రులు తప్పనిసరిగా పాటించాలి. డబ్బు కోసం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కడం సహజమే. అయితే సాక్షాత్తు ప్రభుత్వ ఆస్పత్రికి కూడా ఇటువంటి కుయత్నాలు తప్పడం లేదు. దీనికి నెల్లూరు జిల్లా కేంద్రంలోని డిఎస్‌ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడానికి చేస్తున్న ప్రయత్నాలే నిదర్శనం. కిడ్నీ పాడై దుర్భర జీవితాన్ని గడుపుతున్న రోగుల ప్రాణాలను కాపాడేదే డయాలసిస్ చికిత్స. ఈ చికిత్సను తప్పనిసరిగా ఆ రంగంలో నిష్ణాతులైన వైద్యుల అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య నిపుణుడు లేకపోయినా అధికారులు ఈనెల 6వ తేదీన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నారు. కిడ్నీ చెడిపోయిన రోగుల రక్తం శుద్ధి చేయబడే అవకాశం ఉండదు. రక్తాన్ని శుద్ధి చేసే పనిని కిడ్నీలు చేయకపోవడంతో ఆయా రోగులకు చేసే రక్తమార్పిడి విధానాన్ని డయాలసిస్ అంటారు. నిర్థేశించిన సమయంలో డయాలసిస్ జరగకపోతే రోగికి ప్రాణాపాయం కలుగుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి (డయాలసిస్) చికిత్స జరిగినప్పుడు దీనిని ఆ చికిత్స విభాగంలో స్పెషలైజేషన్ చేసిన నెఫ్రాలజిస్ట్ అవసరం. నెఫ్రాలజిస్ట్ అందుబాటులో లేకపోయినా డయాలసిస్ చేస్తే అది చట్టవ్యతిరేక చికిత్స కింద పరిగణించవచ్చు. ఎంబిబిఎస్ తరువాత మూడేళ్ల పాటు పోస్టుగ్రాడ్యుయేషన్ వైద్య విద్యను అభ్యసించాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న తరువాత మరో మూడేళ్ల పాటు ఎంసిహెచ్ కోర్సును పూర్తి చేస్తేనే నెఫ్రాలజిస్ట్ సర్టిఫికెట్ లభిస్తుంది. సాధారణంగా ఈ కోర్సు చేసే వైద్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వ్యవహారిక భాషలో చాలా అరుదు. ప్రస్తుతం జిల్లా మొత్తానికి నెల్లూరులో మూడే డయాలసిస్ కేంద్రాలు ప్రైవేట్ యాజమాన్యాల ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉన్నాయి.అయితే ఒకే ఒక నెఫ్రాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు. ఎంసిహెచ్ కోర్సు పూర్తి చేసి నెఫ్రాలజిస్ట్ సర్టిఫికెట్ పొందిన వారు అతి తక్కువగా ఉండటంతో నెల్లూరుకు చెందిన సదరు నెఫ్రాలజిస్ట్ నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు కూడా వెళ్లి చికిత్స చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నెఫ్రాలజిస్ట్ అందుబాటులో లేకపోయినా నెల్లూరు జిల్లా కేంద్రంలోని డిఎస్‌ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు తెగింపుతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి రెండు డయాలసిస్ మెషిన్లు కూడా తెప్పించారు. ఈనెల 6వ తేదీన ఈ సెంటర్‌ను ప్రారంభించి డయాలసిస్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే నెఫ్రాలజిస్ట్ లేకుండా చేసే డయాలసిన్ చికిత్స ఏమేరకు విజయవంతంగా నిర్వహించగలరో, ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందో వేచిచూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment