Saturday, February 6, 2010
చిల్డ్రన్ (ఛీద్రం) పార్క్
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్: ఇరుకు గదుల్లో స్కూళ్లు, గాలి దూరని అపార్ట్‌మెంట్‌లలో కాపురాలతో విసిగిపోయే నగర జీవులకు సాయంత్ర వేళల్లో పచ్చదనంతో, ఆహ్లాదకర వాతావరణంతో మనసుకు ఉల్లాసాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకునే బృందావనాలు పార్కులు. నగరంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ పదేళ్లు గడవకముందే వృద్ధాప్య ఛాయలతో పిల్లలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా తయారైంది. పార్క్ నిర్వహణలో అవసరమైన చర్యలు ఏవీ లేకపోవడంతో సుందరంగా ఉండాల్సిన పార్క్ ఆహ్లాదకర వాతావరణం ఛీద్రంగా మారిపోయింది. పార్క్ అనగానే పిల్లలు ఆట పాటలకు పచ్చని గడ్డితో స్వాగతం పలికే తివాచీలు లాంటి మృదుత్వం కరువై ఉన్న గడ్డి కాస్తా ఎండిపోతుంది. సరైన ఆలన పాలన లేక పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తువులు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిర్వాహకులు మాత్రం ప్రవేశరుసుము రూ.5 లతో పాటు ఒక్కొక్క విభాగానికి ప్రత్యేక రేట్లను కేటాయించి డబ్బులు వసూలు చేయడంలో మాత్రం చురుగ్గా పనిచేస్తున్నారు. కనీసం ఆ పరికరాల పెయింట్ విషయం కూడా పట్టించుకునేవారు లేరు. పిచ్చి మొక్కలతో ముళ్ల కంపలతో నిండిన వాతావరణం రాత్రి వేళల్లో చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారిందనడానికి అక్కడవున్న ఖాళీ మందు బాటిళ్లు, తదితర చీకటి సామాగ్రి సాక్ష్యం. పార్క్ ప్రారంభంలో పిల్లలు అత్యంత ఉత్సాహంగా వీక్షించడానికి ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్ పూర్తిగా పనికిరాని స్థితికి చేరుకుంది. పార్క్‌లోని ప్రతి పరికరం పనికిరాని స్థితికి చేరుకున్నప్పటికీ పట్టించుకునేవారు లేకపోగా పార్క్ రుసుములు వసూలు చేయడానికి మాత్రం సిబ్బంది అత్యుత్సాహం చూపడం విశేషం. పిల్లల కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన చిల్డ్రన్స్ పార్క్ పిల్లలకు కాక, కొంతమంది పెద్దలకు మాత్రమే ఉపయోగపడడం పట్ల మేజర్‌న్యూస్ పార్క్‌కు విచ్చేసినవారిని ప్రశ్నించగా కనీసం వివరణ ఇవ్వడానికి కూడా రోజూ వచ్చే వాకర్స్ వెనుకాడారు. దీన్నిబట్టి నిర్వాహకుల ఆధిపత్యం పార్క్ సందర్శకులపై ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సాధారణ అవసరాలైన తాగునీటి వసతి, సరైన విద్యుత్ దీపాల కాంతి లేని చిల్డ్రన్స్ పార్క్ స్థితిని గమనించినవారు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెల్లడించకపోయినా ఎవరికి వారు ఈ పార్క్ ‘ఛీ-ఛీద్రం’ అనుకోవడం ఖాయం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment