Saturday, February 13, 2010
శ్రీకృష్ణులే శెలవివ్వాలి.
తోటపల్లిగూడూరు, మేజర్‌న్యూస్: మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో జరిగిన జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు పలు విమర్శలకు దారి తీశాయి. తాము గెలవడం కోసం మద్యం మత్తులోవున్న యువకులు అన్యం పున్యం ఎరుగని ఎద్దుల నడ్డి విరిగేలా బాదుతుంటే చూస్తున్న కొందరి మానవతావాదుల కళ్లు చెమ్మగిల్లాయి. ఇది అనాగరిక చర్య అంటూనే బహరంగ విమర్శ చేయడానికి మాత్రం వెనుకాడారు.ఆనందించడానికి, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వేలాది పోటీలుండగా ఈ రకమైన హింసాత్మక పందాలను ఎందుకు ఎన్నుకుంటున్నారో అర్థం కావడంలేదని మరికొందరు వాపోయారు. ఓ పక్క నేతలు ప్రోత్సహిస్తుంటే, అరికట్టాల్సిన అధికారులు సోద్యం చూస్తుంటే దీనికి అంత ంలేదా అంటూ ప్రజలు తర్కించుకున్నారు. అహింసో పరమో ధర్మః అంటూ జాతిపిత బాపూజీ సత్యవాక్కును చాటిన మన భారతదేశంలో ఇలాంటి అకారణ హింసాత్మక సంఘటనలు జరుగడం దురదృష్టకరం. పోటీదారుడు నీలిగి ఎద్దువెన్ను చెదిరేలా తనచేతి జాఠీకోలాతో బాదుతుంటే అది బాధకు ఎగిరిందో, లేక ముందుకు ఉరకడానికి ఎగిరిందో తెలియదు కాని ఈలలు, చప్పట్లు కొట్టి ప్రోత్సహించే ప్రేక్షకుల్లో మాత్రం కొద్దిపాటి రాక్షసత్వం కనిపించక మానదు. ఆసక్తి లేకపోయినా, అనారోగ్యంతోవున్నా తన యజమాని గెలుపునకు సహకరించాల్సిందే. లేదా చావుదెబ్బలు తినాల్సిందే.నోటినిండా తిరంగాలు, కిళ్లీలు వేసుకుని నన్ను ఓటమిపాలు చేసావా అంటూ ఎద్దుపై ఉమ్మడాన్ని జీవరాశుల్లో కూడా దేవుణ్ణి కొలిచే మనదేశంలో ఏమంటారో ఒకసారి ఊహిస్తే తెలుస్తుంది. కాని ఆ మూగజీవాల గుండెల్లో మాత్రం తన యజమాని పట్ల, ఇలాంటి పోటీలు ప్రోత్సహించేవారిపట్ల ఎనలేని అపార్థం మూటకట్టుకట్టుకుని ఉంటుంది.స్వచ్ఛమైన కల్మశం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలను నిర్వహించడం వల్ల కక్షలు రగిలే అవకాశముంది. తద్వారా నేతల మధ్య స్పర్థలు మొదలై ప్రశాంతత దెబ్బతినే అవకాశముంది. కావున ఉన్నతాధికారులు గ్రామీణ ప్రాంతాల పెద్దలు మానవతా హృదయంతో ఆలోచించి ఇలాంటి హింసాత్మకమైన పోటీలు ఆపడం ద్వారా జీవరాశిని రక్షించడానికి నాంది పలకాల్సివుంది. లేదంటే మూగజీవాలు పూర్తిగా అంతమై మానవ మనుగడకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఎంతైనా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment