కోవూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన ఉప ఎన్నిక చదురు మదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఉదయం 11 గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ అనంతరం ఊపందుకొంది. సాయంత్రం ఐదు గంటలకల్లా 76శాతం పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కొడవలూరు మండలం లోని మానేగుంటపాళెంలో వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేశారన్న నెపంతో కాంగ్రెస్‌పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తండ్రి, కూతుర్ని చితక బాదారు. దీంతో మానేగుంటపాళెంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపులను చెదరగొట్టడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.
పోలీసులు బాధితులను సంబంధిత స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెప్పడంతో వారు కొడవలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే బుచ్చిమండలంలోని శ్రీపురంధపురంలో 485 మంది ఉన్న ఈ గ్రామంలో ఓటింగ్‌ను బహిష్కరించారు. ఎన్నికలను బహిష్కరించిన విషయం ఎన్నికల అధికారి ఈ విషయాన్ని ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ర్ట ఎన్నికల అధికారి సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌కు తెలియజేశారు. జిల్లా కలెక్టర్, ఆర్‌డిఓ సుబ్రహ్మణ్యంకు ఎన్నికల్లో ప్రత్యేకంగా నియమించిన డిఎస్‌పికి సంఘటన గురించి వాకబు చేయమని సంఘటనా స్థలానికి పంపించారు. దీంతో తిరిగి 1.40గంటల నుంచి శ్రీపురందరపురంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. అనంతరం కోవూరులో 246 ఇవిఎం 2గంటలపాటు మోరాయించింది. అనంతరం వేరే ఇవిఎం ద్వారా ఓటింగ్‌ను కొనసాగించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని స్థానిక రిజిస్టార్ కార్యాలయం వద్ద ఉన్న పోలింగ్ బూత్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకాకర్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు కొద్దిసేపు వివాదం జరిగింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను అక్కడ నుంచి పంపివేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.
అలాగే ఇందుకూరుపేట మండలంలోని గంగవరంలో ఉన్న 224 బూత్‌లో కొద్ది సేపు ఇవిఎం మోరాయించింది. అనంతరం తిరిగి ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.
కోవూరు పరిధిలోని చెర్లోపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాలని చెపుతుండడంతో ఈ ప్రాంతంలో వైఎస్‌ఆర్ సిపి, టిడిపి పార్టీల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విష్ణువర్థన్‌రెడ్డి అక్కడి నుంచి పంపించి వేయడంతో ఎటువంటి వివాదం లేకుండానే ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. అదే ప్రాంతంలో ఒకే బజారులో ఉన్న 42మంది ఓటర్లు తమ ఓటులేదని కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. వారి వద్ద ఆ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు అన్ని ఆధారులు ఉన్నప్పటికి ఓటరు లిస్టులో ఆ 42 మంది పేర్లు లేక పోవడంతో విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి అధికారులు ఓటరు లిస్టులో పేరులేక పోతే తామేమి చేయలేమని తెలపడంతో ఆ 42 మంది ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారి అక్కడి నుంచి పంపించి వేశారు.
కోవూరు మండలానిక వస్తే ఎంఆర్‌ఓ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఓటింగ్ విషయమై వివాదం చోటు చేసుకుంది. పోలీసులు అప్రమత్తమై వివాదాన్ని మొదటిలోనే అణచివేయడంతో ఎటువంటి అల్లర్లు చెలరేగలేదు. ఈ ఘటన ఉదయం 10 గంటల నుంచి 10.35 గంటల వరకు అర్థగంట పాటు జరిగింది. మొత్తంమీద కోవూరు ఉప ఎన్నికలో చిన్న చిన్న ఘర్షణలు గందగోళాలు, ఆందోళనల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది
No comments:
Post a Comment