నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై బెట్టింగ్ రాయుళ్లే గందరగోళానికి గురవుతున్నట్లుగా సమాచారం. కొవూరులో ఎవరు గెలుస్తారు? రెండో స్థానంలో ఎవరుండారు? గెలిచే అభ్యర్థికి మెజార్టీ ఎంత ఉంటుంది అనే విషయాలపై జోరుగా బెట్టింగు జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఓ పార్టీ అభ్యర్థి గెలుస్తారని, అది భారీ మెజార్టీతో గెలుస్తారని భావించిన బెట్టింగ్ రాయుళ్లు శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ సరళిని చూసిన తర్వాత తమ మనసు మార్చుకున్నారట. తొలి రెండు గంటల్లో భారీగా ఓటింగ్ నమోదైనప్పటికీ ఆ తర్వాత ఎండ, తదితర కారణాల వల్ల ఓటింగ్ శాతం తగ్గింది. సాయంత్రం ఓటింగ్ శాతం పుంజుకుంటుందని భావించినా అది జరగలేదు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు తమ మనసు మార్చుకున్నారని అంటున్నారు.
ఇప్పటి వరకు గెలుస్తాడని భావించిన, మెజార్టీ భారీగా వస్తుందని భావించిన అభ్యర్థి విషయంలో బెట్టింగ్ రాయుళ్లకు ఆందోళన వ్యక్తమవుతోందంట. దీంతో వారు మళ్లీ మార్చి బెట్టింగులు కడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఓ పార్టీ ఓటుకు రూ. వెయ్యి ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మెజార్టీ, గెలుపుపై ప్రభావం చూపిస్తుందని పందేల రాయుళ్లు అభిప్రాయపడుతున్నారట. దీంతో వ్యూహం మార్చుకొని తాము నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా పందేలు కాస్తున్నారని అంటున్నారు.
No comments:
Post a Comment