ముత్తుకూరు : వద్ద లంచం తీసుకొంటూ ముత్తుకూరు మండల పశువైద్యాధికారి గోగి రెడ్డి ఇందిరారెడ్డి ఎసిబి వలలో చిక్కారు. మంగళవారం ముత్తు కూరు పశువైద్యశాలలో ఆమె విధులు నిర్వహిస్తుండగా పంట పాళెంకు చెందిన వడ్లపూడి వెంకటరమణయ్య సర్టిఫికెట్ కోసం రెండు వేల రూపాయల లంచం ఇచ్చారు. ఆయన బయటకు వచ్చీరాగానే, అక్కడే మాటు వేసిన ఎసిబి అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి భాస్కర్‌రావు, బాధితుడు వెంకటరమణయ్య కథనం మేరకు... ముత్తుకూరు మండలం పంటపాళెంకు చెందిన వడ్లపూడి కాంతమ్మ కృష్ణపట్నం సొసైటీలో రెండు గేదెలకు రుణం పొందడానికి అవసరమైన హెల్త్ అండ్ వాల్యూయేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఫిబ్రవరి 10వ తేదీన ముత్తుకూరు పశువైద్యాధికారి ఇందిరారెడ్డిని కోరారు. అందుకు ఆమె ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు. తాము అంత ఇవ్వలేమని ఆమె కుమారుడు వెంకటరమణయ్య ఆమెకు వివరించారు. డబ్బు తీసుకోకుండా తాను సర్టిఫికెట్ ఇవ్వలేనని, డబ్బులు తీసుకురావాలని ఆమె తేల్చి చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 17వ తేదీన వెయ్యి రూపాయలు ఇవ్వబోగా కనీసం 3వేల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశారు. చివరకు రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొన్నారు. ఎంతో ఆవేదనకు గురైన వారు వెంటనే నెల్లూరులోని ఎసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో వారు మంగళవారం ఉదయం నుండే పశువైద్యశాల పరిసరాల్లో కాపుకాశారు. ఆమెకోసం రైతు, ఆయన తల్లి ఆసుపత్రిలోనే కూర్చుని ఉన్నారు. సుమారు 11.15 గంటల సమయంలో పశువైద్యాధికారి కార్యాలయానికి వచ్చారు. వెంటనే రైతు వెంకటరమణయ్య ఆమెను సర్టిఫికెట్ ఇవ్వాలని, మీరు అడిగిన రెండు వేల రూపాయలను తెచ్చానని తెలిపాడు. దీంతో ఆమె సర్టిఫికెట్ రాసి ఇచ్చారు. రెండు వేల రూపాయలను ఆమెకు ఇచ్చాడు. ఆమె లెక్కపెట్టి బ్యాగులో పెట్టుకున్నారు. రైతు పక్కకు వెళ్లగానే వెంటనే మాటు వేసిన ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రికార్డులను పరిశీలించామని, వాటిని తాము స్వాధీనం చేసుకొన్నామని ఎసిబి డిఎస్పీ భాస్కర్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి ఎసిబి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోనికి పరుగులు తీస్తున్నారని విలేకరులు కూడా వారి వెంట పరుగులు తీశారు. చివరికి ఎసిబి అధికారులని తెలిసుకున్నారు.
No comments:
Post a Comment