
అలాగే ఎక్కువగా వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువులైన రేడియో, టెలివిజన్, మొబైల్స్, సెల్‌ఫోన్‌లతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై బల్బులు, స్విచ్‌లు తదితర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం సామాన్య మానవుడికి మింగుడు పడడం లేదు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఏ వస్తువైనా కిలో రూ.70, రూ.80లకు తక్కువ లేదనడంలోకూడా సందేహం లేదు. వీటికి వ్యాట్ అనే పేరుతో అదనంగా మరో రూ.5లను పెంచి అమ్ముతున్నారు. అలాగే వస్త్ర దుకాణాల్లో కూడా చీరల వద్ద నుండి ప్యాంట్లు, టవల్స్ షర్ట్‌స , లుంగీలు, రెడీమేడ్ దుస్తులు అన్నింటిపై 5 శాతం వ్యాట్‌ను కలిపి అమ్ముతుండడంతో కనీసం రెడీమేడ్ వస్తువులను కూడా కొనలేని పరిస్థితిలో ప్రజలున్నారు. దీనికితోడు పెంచిన ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు, సిమెంటు, ఇనుము, తదితర వస్తువులన్నీ రేట్లను విపరీతంగా పెంచడంతో మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లును కట్టుకోవాలన్న కల కూడా కలగానే మిగిలిపోతుంది.
పెంచిన ఇంటి పన్నుల కారణంగా బాడుగ ఇళ్లలో ఉంటున్న వారికి కూడా ఇంటి అద్దెలు విపరీతంగా పెంచడం తదితర సమస్యలతో సామాన్య మానవుడు సతమతమవుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోల్ చార్జీలు కూడా పెంచుతారన్న వ్యాఖ్యలు వినిపిస్తుండడంతో వాహనదారుల్లో ఆందోళన చోటుచేసుకుంటుంది. ఇప్పటికే వాహనాలపైన అత్యదిక రేట్లకు అమ్ముతుండడం, పెట్రోల్ చార్జీలుకూడా పెరుగుతాయన్న వ్యాఖ్యలతో పేద, మద్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ చార్జీలు పెరిగినట్లయితే మళ్లీ అన్ని వస్తువులు రేట్లను పెంచే అవకాశం ఉండడంతో రానున్న రోజుల్లో ప్రతి వస్తువు రేటు పెరిగిపోయి ఏమీ కొనలేము, ఏమీ తినలేము అన్న వ్యాఖ్యలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆ సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ పక్కనపెట్టి విపరీతంగా రేట్లు పెంచడం ప్రజల్లో ఆందోళన కలిగించే అంశంగా మారివుంది.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిన సమయంలో ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేయడం, అసెంబ్లీ ముందు గందరగోళాలు చేయడం, స్తంభింపచేయడం వంటి చర్యలు చేసి కాల్పుల వరకు తీసుకెళ్లిన సంఘటనలు జరిగివున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని తరహా వస్తువులపై రేట్లను పెంచుతున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ మౌనం వహించడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన, వ్యతిరేకత పార్టీలపై ఏర్పడే పరిస్థితి నెలకొనివుంది. తూతూ మంత్రంగా వామపక్షాలు పెంచుతున్న రేట్లపై అడపాదడపా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఆందోళన చేయడం తప్ప పూర్తిగా తగ్గించేంతవరకు పోరాటం చేయాలన్న ఆలోచన లేకపోవడం ప్రజలను కలవరపరుస్తుంది. దీంతో కూడా ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీల కోసం పెంచిన చార్జీలను తగ్గించే విధంగా ప్రయత్నాలు చేసే పార్టీల వైపు మొగ్గు చూపుతుండడం కూడా గమనార్హం.
ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పెంచిన రేట్లపై తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ప్రజల్లో కొంతలో కొంతైనా ఉపశమనం కలిగించే అంశం అవుతుంది అని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సివుంది.
No comments:
Post a Comment