online marketing

Tuesday, April 3, 2012

ఉప ఎన్నికల కు ఏక్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం రెండో దశ ఉప పోరుకు


నెల్లూరు నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీలకు ఉప ఎన్నికల కు ఏక్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రెండో దశ ఉప పోరుకు ఇప్పటికే అధికారులు సమాయత్తమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఓటర్ల జాబితాల సవరణ వంటి కార్యక్రమాల్లో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ త్వరలో నెల్లూరుకు విచ్చేసి ఈ ఉప ఎన్నికలపై అధికారులతో చర్చించనున్నారు. దీర్ఘకాలికంగా పని చేస్తున్న మండల స్థాయి అధికారుల బదిలీలకు జాబితాలు సిద్ధమయ్యాయి. తహసీల్దార్లు, ఎస్ఐలకు బదిలీలు ఉండవచ్చునన్నది సమాచారం. ఇప్పటికే కొందరు అధికారులను బదిలీ చేశారు. మరో వైపు నేతల్లో హడావుడి జోరందుకుంది. పార్టీల వారీగా అభ్యర్థుల ఖరారు, నియోజకవర్గాల్లో నేతలు పర్యటన సాగుతున్నాయి.

ఏర్పాట్లలో అధికారులు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజీనామా ఆమోదం, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. నెల్లూరు నగరం, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లా కందుకూరు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఓ దశ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలు తనిఖీ చేసి నివేదికలు సిద్ధం చేశారు. మరో వైపు ఓటర్ల జాబితాలలో జరిగిన తప్పులను సరి చేస్తున్నారు.

ఖచ్చితంగా ఫొటోలు, పేర్లు వంటివి సరిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. చేర్పులు, మార్పులతో తాజా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడంలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతీ శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బన్వర్‌లాల్ నెల్లూరుకు విచ్చేసి ఈ నియోజకవర్గాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కోవూరు ఉప ఎన్నికలను ఎంతో సమర్ధవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించడంతో కలెక్టర్ బీ శ్రీధర్‌తోపాటు జిల్లా యంత్రాంగానికి ప్రశంసలు లభించాయి. అదే రీతిలో రెండో దశ ఉప ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

భారీగా బదిలీలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వచ్చే ఏడు నియోజకవర్గాల్లో దీర్ఢకాలికంగా పని చేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీలు చేసేందుకు భారీ కసరత్తే జరుగుతోంది. మూడేళ్లు పూర్తి చేసిన వారిని సాగనంపనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్, ఆర్డీవో మండలాల్లో పని చేసే తహసీల్దార్ల జాబితా రూపొందించి 25 మందిని ఎంపిక చేశారు. తొమ్మిది మందిని ఇప్పటికే బదిలీ చేసిన కలెక్టర్ మిగిలిన వారి బదిలీలపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇక పోలీసు శాఖలో ఆత్మకూరు, కావలి డివిజన్‌లకు తాజాగానే డీఎస్పీలు నియమితులయ్యారు. ఇక సీఐలు, ఎస్ఐల బదిలీలు తప్పేటట్లు లేదు. షెడ్యూల్ వెలువడే లోగా అధికారుల బదిలీలు పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఇక డీఆర్వో బీ రామిరెడ్డి, జేసీ సౌరభ్‌గౌర్‌లు కూడా మూడేళ్లు పూర్తి కావడంతో వీరిని బదిలీ చేసే అవకాశం ఉంది.

ఏ క్షణాన్నైనా.. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఓ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. మినీ సంగ్రామంగా పేర్కొంటూ మే లోగా ఎన్నికలు నిర్వహిస్తారన్నది సమాచారం. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోగా ఈ ఖాళీలను భర్తీ చేయాలన్నది ఆలోచన. దీని కోసం ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేపట్టింది.

నేతల్లో హడావుడి నెల్లూరు పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీ అభ్యర్థిగా తాజా, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇక కాంగ్రెస్ నుంచి రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని రామారావు, వైఎస్సార్సీ నుంచి తాజా, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎన్ఆర్ఐ వెంకటేశ్వర్లు చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, మాదాల జానకిరామ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైఎస్సార్సీ నేతలు ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారాలు కూడా సాగిస్తున్నారు. షెడ్యూలు రాకముందే నేతల్లో హడావుడి మొదలైంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh