నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఆపార్టీకి సమస్యగా మారింది. ఇప్పటికే టిడిపి, వైఎస్‌ఆర్‌సి తమ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. కోవూరు ఉపఎన్నికల్లో కూడా చివరి దాకా అభ్యర్థిని ప్రకటించని కారణంగా ఆపార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు ఖరారైనా కేవలం గ్రూపుల కారణంగా చివరి వరకు ప్రకటించలేదు. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడం, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆ పార్టీకి మూడో స్థానం దక్కింది. దానిని నుంచి గుణపాఠం తీసుకున్న ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలకు త్వరగా అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర స్థాయిలో సిఎం. పిసిసి అధ్యక్షులకు మధ్య గొడవల కారణంగా అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎంఎల్‌ఎ ఆనం వివేకానందరెడ్డి పేరు కొద్ది రోజులుగా మీడియాలో కన్పిస్తోంది. అలాగే మాజీ ఎంపి, జిల్లా వాసి టి. సుబ్బరామిరెడ్డి, మాగుంట పార్వతమ్మ, మాదాల జానకిరామ్, ప్రముఖ కాంట్రాక్టరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఎంపి అభ్యర్థి ఎంపికలో ఆనం సోదరుల సిఫార్సులు పనిచేయవని తెలుస్తోంది. కోవూరు టికిట్ విషయంలో పోలంరెడ్డి సామర్థ్యంతోపాటు ఆనం సోదరుల సిఫార్సు ప్రముఖంగా పనిచేసింది. పోలంరెడ్డి గెలుపుకు ఆనం సోదరులు ఎలాంటి కృషీ చేయలేదన్న విమర్శలు వచ్చాయి. అందువల్లఎంపి అభ్యర్థి ఎంపికలో పెద్దగా ఆనం సోదరుల ప్రమేయం ఉండదని తెలుస్తోంది. ఉదయగిరి శాసనసభకు కాంగ్రెస్ తరపున మాజీ ఎంఎల్‌ఎ కంభం విజయరామిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన పేరును మాజీ మంత్రి మాదాల జానకిరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉదయగిరి ప్రాంతానికి చెందిన పెద్దపాడు గ్రామానికి చెందిన వెండ్లారు వెంకటేశ్వర్లు చౌదరి పేరును మాదాల జానకిరామ్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టిడిపి, వైఎస్‌ఆర్‌సిలు ఇప్పటికే తమ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశాయి. టిడిపి పార్లమెంట్ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేరు ఖరారైంది. 2009 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా ఈ ఉప ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లోనూ వంటేరు కీలకంగా వ్యవహరించారు. వంటేరు కూడా చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా బొల్లినేని రామారావు పేరును ఇప్పటికే ఆపార్టీ ఖరారు చేసింది. ఇటీవల రైతుపోరుబాట ముగింపు కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించినప్పుడు చంద్రబాబునాయుడు ఈ మేరకు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో రామారావును గెలిపించాలని కూడా ప్రచారం చేశారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కారణమైన మేకపాటి సోదరులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి పేర్లనే వైఎస్‌ఆర్‌సి నెల్లూరు పార్లమెంటు, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలకు రును ఖరారు చేసింది. వైఎస్‌ఆర్‌సి పార్టీ తరపున పోటీచేయనున్న మేకపాటి సోదరులపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉంది. ఎంపిగా గెలిచినప్పటి నుండి రాజమోహన్‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యం. అప్పటి నుండి జగన్ భజన చేస్తూనే కాలం గడిపారు. ప్రజా సమస్యలపై ఒకరోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై కొంత అభిమానం ఉన్నా మేకపాటి సోదరుల మీద ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పడుతుందని పరిశీలకులు అంటున్నారు.
This comment has been removed by the author.
ReplyDeleteనెల్లూరు రాజకీయ నాయకుల సమర్ధత,ఆ ఊరిలో రోడ్లు చూస్తే తెలుస్తుంది. ఇక ఆ ఊరి ప్రజలు తక్కువ వారు కాదు, పదే పదే ఆనం సోదరులను గెలిపిస్తారు. ఒక్క రోడ్ సరిగా ఉండదు, అయినా వారినే గెలిపిస్తారు.ఎక్కడో దేశానికి దూరంగా ఉండేవారికి, ఈ బ్లాగు పెట్టి మరచిపోయిన అసమర్ధ నాయకులను,అనవసరం గా గుర్తుకు తెస్తున్నారు.
ReplyDelete